ఏపీలో ఉద్యోగుల నిరసన అత్యంత ఆసక్తికరమైన పరిణామం. ఏపీలో ఒక్కో వర్గంపై తన నిర్ణయాలతో తీవ్ర ప్రభావం చూపుతున్న జగన్ కు ఇంతవరకు అమరావతి రైతులు తప్ప ఎవరూ సంఘటితమై నిరసన తెలపలేదు. మొదటి సారి అత్యంత బలవంతులు అయిన ఉద్యోగులు ఏకమై ఎదురుతిరిగారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు – జగన్ వ్యవహారంపై ఒక ఏపీ పౌరుడి ఆసక్తికరమైన పోస్టు వైరల్ అవుతోంది.
ఇక్కడ చదవొచ్చు …
కేంద్రం ఇస్తున్న సబ్సిడీని ఆపుచేసి రైతులకు అన్యాయం చేసావు, అందరికీ ఇల్లు అంటూ కేంద్రం సామాన్యులకు ఇచ్చిన ఇల్లను ఆపుచేసేసావు, అందులో కొంతమంది అనర్హులు అంటూ, వాళ్ళు అప్పు చేసి కట్టిన డబ్బులు కూడా వెనక్కు ఇవ్వకుండా తొక్కిపట్టావు, కాంట్రాక్టర్లకు, సప్లైయర్స్కు బిల్స్ ఇవ్వకుండా కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడేటట్టు చేసావు.
డబ్బులు పంచితే నీకు ఓట్లు వేస్తారని, నాలాంటి సామాన్యులకు అర్ధం కాని, ప్రజల దగ్గర డబ్బులుంటే, కొనుగోళ్ళు జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఒక సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొని వచ్చి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ధనాన్ని పంచుతున్నావు. నీ ఉచితాల దెబ్బకు కార్మికులు, కూలీలు దొరకక వ్యవసాయ, భవన నిర్మాణ, చిన్న పరిశ్రమల, చేతి వృత్తుల రంగాలను సర్వ నాశనం అయ్యేటట్టు చేసావు.
నీకు ఎవరి మీద పగో అర్ధం కావడం లేదు, ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల భ్రష్టు పట్టించాలో అన్ని విధాలా భ్రష్టు పట్టించావు. నీ అదృష్టం బాగుండీ, మా తలరాత ఇలా ఏడ్చి, నేను పైన చెప్పిన, చెప్పకుండా ఉన్న ఇంకొంతమంది మిగిలిన వాళ్ళు, వీళ్ళెవరూ కూడా సంఘటితంగా ఉన్నవారు కాదు.
కానీ ఇప్పుడు నువ్వు కెలికింది, ప్రభుత్వాలనే కూల్చగలిగే శక్తి ఉండి, మీకంటే అంటే, మీ రాజకీయ నాయకులకంటే హీనమైన మనస్థత్వం ఉన్న ప్రభుత్వోద్యోగులను. ఈ విషయంలో మాత్రం నీకు ప్రజల మద్ధత్తు దొరుకుతోంది. అది కూడా ప్రభుత్వోద్యోగులు, రాజకీయ నాయకులు అంటే ప్రజలలో ఉన్న ఏహ్య భావం వలన. మిమ్మల్ని అంటే ఓట్ల రూపంలో ఓడించి కసి తీర్చుకోగలము, కానీ వాళ్ళను ఏమీ చెయ్యలేకపోతున్నామే అనే భావం సామాన్యుడిలో గూడు కట్టుకుపోయి ఉంది. అది ఇప్పుడు నీకు ఉపయోగపడుతోంది.
వాళ్ళను మీరు కూడా ఏమీ చెయ్యలేరు, ఎందుకంటే మీ జాతకాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇప్పటికే నీ బినామీ ఆస్థుల వివరాలన్నీ వాళ్ళు జాగ్రత్త చేసి ఉండి ఉంటారు, అవన్నీ ఇంకో వారంలో ప్రతిపక్ష వార్తా మాధ్యమాలలో సీరియల్లుగా వస్తాయి.
ఇది నీకు పరీక్షా సమయం, నువ్వు నెగ్గి ఓడుతావో, వాళ్ళు ఓడి నెగ్గుతారో కొద్ది కాలంలో తెలిసిపోతుంది. ఈ విషయంలో నువ్వు వెనక్కు తగ్గావంటే మాత్రం, నీ విలువ పూచికపుల్ల కంటే హీనంగా దిగిపోతుంది.