సినిమాల ప్రభావం ఉండదని చెబుతారు కానీ.. వాస్తవం మాత్రం అందుకు భిన్నమని చెప్పాలి. మంచి తక్కువ కానీ.. చెడు మాత్రం చాలా తేలిగ్గా ఫాలో అయ్యేలా చేస్తుంది. కొద్ది రోజుల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న బన్నీ నటించిన పుష్ప మూవీలో మాదిరి.. ఎర్రచందనం స్మగ్లర్ గా ఒక వ్యక్తి ట్రై చేసి అడ్డంగా బుక్ అయిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప మూవీలో పాల ట్యాంకర్లో కొంత భాగాన్ని ఎర్ర చందనం దుంగలతో మరికొంత భాగాన్ని పాలతోనింపి తీసుకెళ్లటం తెలిసిందే.
పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందాడేమో కానీ.. ట్రక్కు డ్రైవర్ గా పని చేసే యాసిన్.. కర్ణాటక – ఆంధ్రా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఎర్రచందనం లోడును తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎర్ర చందనం దుంగలు వేసి.. దానిపై పండ్లు.. కూరగాయల డబ్బాల్ని సెట్ చేశాడు. ఈ ట్రక్కుకు కొవిడ్ -19 నిత్యవసర వస్తువులు అంటూ ఒక స్టిక్కర్ అంటించాడు.
ఏపీలోని అన్ని పోస్టుల్ని విజయవంతంగా దాటేసిన అతడు.. మహారాష్ట్రలో ఎంట్రీ ఇచ్చి.. అక్కడి పోలీసుల దెబ్బకు అడ్డంగా దొరికిపోయాడు. సంగ్లీ జిల్లాలోని గాంధీ చౌక్ వద్దకు వచ్చినంతనే పోలీసులు ట్రక్కును అడ్డుకున్నారు. నిశితంగా చెక్ చేసి.. అందులోని ఎర్రచందనం దుంగల్ని గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. తాజాగా స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం దుంగల ఖరీదు ఏకంగా రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పుష్పలో హీరో పాత్రధారి ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ చిక్కకపోవటం చూసి.. అలానే ట్రై చేసి అడ్డంగా బుక్ అయ్యాడు.రీల్ కు రియల్ కు మధ్య తేడా చాలానే ఉంటుందన్న లాజిక్ మిస్ కావటమే.. అతగాడు బుక్ అయ్యాడని చెప్పక తప్పదు.