తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులంతా పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. పీఆర్సీ వ్యవహారంలో చాలాకాలంగా ప్రభుత్వం నాన్చుడు ధోరణితో ఉండడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ సాధన సమితి చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్డుకు ఉద్యమకారులు ఎవ్వరూ రావద్దని విజయవాడ పోలీసులు ఉద్యోగులకు కోరారు. కానీ, చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
కానీ, కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరతామని పీఆర్సీ సాధన సమితి చెబుతోంది. ఈ క్రమంలోనే బెజవాడకు రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలి వస్తున్నారు. దీంతో విజయవాడకు వచ్చే దారులన్నింటి దగ్గర పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకుంటున్నారు. చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ప్రకాశం బ్యారేజి కనకదుర్గమ్మ వారధి దగ్గర పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. వారధి, ప్రకాశం బ్యారేజ్, రామవరప్పడు రింగ్ రోడ్డు, బిఆర్టియస్ రోడ్డులలో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులు మారు వేషాల్లో విజయవాడకు చేరుకున్నారు. కొందరు బిచ్చగాళ్ల వేశంలో వస్తే.. మరికొందరు రైతుల్లా విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చారు.
పోలీస్ వ్యూహాలు, వలయాలను చేధించుకుంటూ పెద్దసంఖ్యలో ఉద్యోగులు, ఉద్యోగులు సంఘ నాయకులు విజయవాడ చేరుకున్నారు. ఇలా చేరుకుంటున్న వారిని పార్వతీపురం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా ఉద్యోగులు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాలు, ఆందోళనలు చేపట్టి తమ నిరసన తెలుపుతున్నారు.