2019 ఎన్నికలలో వైసీపీ అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 151 స్థానాల్లో వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది. వాస్తవానికి, వైసీపీకి 90-100 స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా భావించారు. కానీ, అనూహ్యంగా మరో 50 సీట్లు అదనంగా రావడంతో జగన్ అండ్ కో స్పీడుకు బ్రేకులు లేకుండా పోయాయి. అసెంబ్లీలో కూడా మందబలం ఉందన్న ధీమాతో వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇక, జగన్ అయితే…తమకు 151 మంది…ఎమ్మెల్యేలున్నారన్న బలాన్ని ప్రతిపక్ష నేతలను విమర్శించడానికి వాడుకున్నారు.
ఆ బలంతోనే మొన్న మొన్నటివరకు వైఎస్ జగన్ బిందాస్ గా ఉన్నారు. తమ పార్టీకి, తనకూ ఎదురే లేదని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి తమను ఢీకొట్టే పార్టీ ఏపీలో లేదని హ్యాపీగా ఫీలయ్యారు. 2024 ఎన్నికల్లో..ఆ మాటకొస్తే ఎన్నికలు ఎప్పుడు వస్తే అపుడు గెలుపు తమదేనని ఫిక్సయ్యారు. ఇటువంటి సమయంలో జగన్ కు ఆయన పొలిటికల్ స్ట్రేటజిస్ట్ పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ షాకిచ్చారని తెలుస్తోంది. వైసీపీది బలుపు కాదు వాపని తెలిసే సర్వే నివేదికను జగన్ కు అందజేశారని, ఒక్క ఛాన్స్ అని అడగ్గానే ఇచ్చిన ఏపీ ప్రజలు…జగన్ అండ్ కోకు మరో చాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని పీకే సర్వేలో వెల్లడి కావడంతో జగన్ ఖంగు తిన్నారని టాక్ వస్తోంది.
మరోసారి ఏపీలో అధికారం దక్కడం కష్టమని పీకే చెప్పడంతో జగన్ డైలమాలో పడ్డారట.తనకు బాగా గురి ఉన్న పీకే టీం సర్వే చేయడంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారట. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 100 స్థానాల్లో ఫ్యాన్ తిరిగే అవకాశం లేదని పీకే అంచనా వేస్తుండడంతో జగన్ అయోమయంలో పడ్డారట. కొద్దో గొప్పో ప్రజా వ్యతిరేకత, ఉద్యోెగుల్లో వ్యతిరేకత ఉందని భావించిన జగన్…ఈ రేంజ్ లో వ్యతిరేకత ఉందని తెలియడంతో షాకయ్యారట. మరి, ఇప్పటికైనా జగన్ అండ్ కో బలం ఏంటో ఏపీ ప్రజలు గుర్తించి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీని ఎన్నుకుంటారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.