రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక్కోసారి ఎవరూ చెప్పలేరు. ఎక్కడో జరిగే సంఘటనలకు, మరెక్కడో జరిగే ఘటనలకు లింక్ ఉంటుందని ఓ ప్రముఖ సినిమాలో చెప్పినట్లే… రాజకీయాల్లో కూడా అనేక ఘటనలు అలా కనెక్ట్ అయిపోతుంటాయి. అలాంటిదే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ శివాలెత్తడం, దానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ అయిపోవడం. వివరాల్లోకి వెళితే, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై స్పందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజ్యాంగం గురించి స్పందించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని మార్చివేయాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై రకరకాల చర్చలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లోకి తాజాగా ఏపీ సీఎం జగన్ వచ్చారు.
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాజ్యాంగ నిపుణులు, దళిత వర్గాలు తమదైన శైలిలో స్పందిస్తున్న సమయంలో ఏపీకి చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జవహర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ వివాదంలోకి లాగి ఇటు కేసీఆర్‌ను ఇటు వైఎస్ జగన్ ను ఇరుకున పడేశారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అని కేసీఆర్ మాట్లాడటం రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ తో పాటు దేశ ప్రజలను అవమానించటమేనని కేఎస్ జవహర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మౌనం పలు అనుమానాలకు దారి తీస్తోందన్నారు.
దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని జవహర్ తెలిపారు. 75 ఏళ్ల నుంచి ప్రజల హక్కుల్ని, స్వేచ్చను కాపాడుతూ వస్తున్న రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని మారిస్తే..ఏపీలో చట్టబద్దంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారా? కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ తక్షణమే స్పందించాలి అంటూ జవహర్ విరుచుకుపడ్డారు.