పీఆర్సీలో తమకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ.. ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం గురువారం జరగనుంది. అయితే.. ప్రభుత్వం మాత్రం బుధవారం నుంచే ఈ కార్యక్రమంపై ఉక్కుపాదం మోపింది. ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహ నిర్బంధం చేసి.. కార్యక్రమానికి వెళ్లొదని నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
‘చలో విజయవాడ’కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉద్యోగులను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేశారు. ‘చలో విజయవాడ’కు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పలువురికి ఇప్పటికే నోటీసులు జారీచేశారు. ఉద్యోగసంఘాల నాయకుల ఇళ్ల చిరునామాలు సేకరిస్తున్నారు. అలాగే విజయవాడకు వెళ్లే వారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ‘చలో విజయవాడ’కు వెళ్లవద్దంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఉద్యోగుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాలతో మంగళవారం రాత్రి నుంచే నందిగామ డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ ఉదయం పోలీస్ స్టేషన్ రావాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు. దీంతో ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.
చలో విజయవాడ’కు వెళ్లకుండా గుంటూరులో పోలీసుల ఆంక్షలు విధించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు ఫోన్లు చేశారు. చలో విజయవాడకు వెళ్లవద్దని హెచ్చరికలు చేశారు. అయితే నిన్న రాత్రే ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన నాయకులు విజయవాడ వెళ్లారు. మూడో శ్రేణి ఉద్యోగ నాయకులను పోలీసులు గృహనిర్భందం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్తిపాడు ఎన్జీవో అధ్యక్షుడు కామిశెట్టి రాంబాబును గృహనిర్భంధం చేశారు. తుని జాతీయ రహదారిపై పోలీస్ చెక్‌పోస్టును ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల నాయకులను విజయవాడకు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. చలో విజయవాడకు అనుమతి లేదని విశాఖ జిల్లా అక్కడి ఉద్యోగులకు సమాచారం అందించారు. విజయనగరంలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు.
బొబ్బిలిలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరిని గృహనిర్బంధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ‘చలో విజయవాడ’కు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకోగా… పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసిన పోలీసులు కొవిడ్ దృష్ట్యా విరమించుకోవాలని సూచించారు.
అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో పోలీసుల మోహరించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. బుక్కరాయసముద్రం, నార్పల క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా… హిందూపురం లో ఎన్జీవో నేత నరసింహులును గృహనిర్భంధం చేశారు. మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.