ఏపీలో పీఆర్సీ పంచాయతీ ముదిరి పాకాన పడుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతుంటే…మరోవైపు ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీపై తగ్గేదే లే అంటూ ముందుకు పోతోందది. ఇప్పటికే, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలివ్వాల్సిందిగా ఏపీ ట్రెజరీ శాఖను ఆదేశించిన జగన్ సర్కార్…తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. పీఆర్సీ వ్యవహారంతో వెనక్కి తగ్గమంటూ సంకేతాలిచ్చేందుకు జగన్ ప్రభుత్వం…తాజాగా పెన్షన్ స్లిప్పులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 2018కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే పెన్షన్ ఫిక్స్ చేస్తూ స్లిప్పులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల విషయంలో జగన్ పట్టిన పట్టు వీడడం లేదు. తన పంతాన్ని నెగ్గించుకునేందుకుగాను మరో అడుగు ముందుకు వేశారు జగన్. తాజాగా కొత్త పీఆర్సీకి అనుగుణంగా సీఎఫ్ఎంఎస్లో పెన్షన్ స్లిప్పులు జనరేట్ కావడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 2018కి ముందు రిటైర్ అయిన వారికి కొత్త పీఆర్సీ ప్రకారం పెన్షన్ నిర్ణయించారు. 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రద్దయింది. కొత్త పీఆర్సీ ప్రకారం 20.02 శాతం డిఏ మంజూరు కాగా…హెల్త్ అలవెన్స్ 97 రూపాయలు పెరిగింది. అడిషనల్ పెన్షన్‌లో వేల రూపాయలు కట్ చేసిన జగన్…హెల్త్ అలవెన్స్‌లో 97 రూపాయలు పెంచి ముష్టి వేశారని పెన్షన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కొత్త పీఆర్సీ ప్రకారం 2018 తరువాత రిటైర్ అయిన వారికి ఐఆర్, డీఏ లేదు.
మరోవైపు, కొత్త పీఆర్సీపై ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 7 నుంచి చేయదలచిన సమ్మెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎస్‌కు ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీసుని సవాల్ చేస్తూ హైకోర్టులో విశాఖకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో పిల్ వేశారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు పిల్లో ప్రస్తావించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే.. సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఉద్యోగుల ఉద్యమంతో కోవిడ్ వ్యాప్తి పెరిగే ప్రమాదం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.