తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల పట్టి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నెటిజన్లు షాక్ ఇచ్చారు. ఆమె ఒకటి తలిస్తే.. నెటిజన్లు మరొకటి తలిచారు. నిజానికి నెటిజన్ల దెబ్బతో చాలా రోజులుగా సోషల్ మీడియాకు కవిత దూరంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా కిన్నెర కళాకారుడు.. దర్శనం మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని కొనియాడారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని.. గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. మొగిలయ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చుగా.. కోటి రూపాయలను కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
“కళాకారులకు సమున్నత స్థానం కల్పించి ప్రోత్సాహించే కళాపిపాసి మన సీఎం కేసీఆర్ గారు. 12 మెట్ల కిన్నెర వాయిస్తూ, పద్మశ్రీ అందుకున్న తెలంగాణ బిడ్డ దర్శనం మొగిలయ్య గారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.కోటి అందించి సత్కరించడం సీఎం శ్రీ కేసీఆర్ గారి గొప్ప మనసుకు నిదర్శనం“ అని కవిత ట్వీట్ చేశారు.
అయితే.. కవిత చేసిన ఈ ట్వీట్‌కు 23 మంది రీట్వీట్ చేశారు. మెజారిటీ నెటిజన్లు.. కవితకు సూటి పోటి ప్రశ్నలు సంధించారు. మరికొందరు గతంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలను రీట్వీట్ చేశారు.
“నమస్కారం కవిత అక్క గారికి. దయతో పేదలకు ఉద్యోగం ఇప్పించమని హృదయపూర్వకంగా ప్రభుత్వం ను అందరూ #DSC2008 మెరిట్ లు వేడుకుంటున్నాము. నిజం అక్క గారు…2016 లోనే ఉద్యోగం ఇస్తా అన్నాడు మనసున్న మారాజు ముఖ్యమంత్రి. వారి కూతురు ద్వార ఉద్యోగం వస్తే, @KTR TRS గారు మా జన్మ ధన్యమైంది“ అని ఇద్దరు నెటిజన్లు పేర్కొన్నారు.
“సంతోషం.. అట్లనే ఢిల్లీ లో చనిపోయిన 700 మంది రైతులకు ఇస్తా అన్న 3 లక్షలు, గల్వాన్ లోయ లో ప్రాణ త్యాగం చేసిన సైనికులకు ఇస్తా అన్న 10 లక్షలు కూడా ఇస్తే బాగుంటది అని నా అభిప్రాయం“ అని మరొకరు చురక అంటించారు.
“ప్రతిభను గుర్తించే మీరు ! ప్రతిభ గల #DSC2008 అభ్యర్దులకు ఉద్యోగం ఇప్పించండి! please“ అని ఇంకొకరు కామెంట్ చేశారు.