ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. డెల్టా కన్నా శరవేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్ లు వేయించుకున్నవారినీ ఇది వదలకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం తక్కువే అయినప్పటికీ…సంక్రమణ రేటు ఎక్కువగా ఉండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి మొదలైపోయిందని డబ్ల్యూహెచ్ వో కూడా చెప్పింది. దీంతో, చాలా దేశాలు లాక్ డౌన్ వంటివి విధించినా ఉపయోగం లేదని ఫిక్స్ అయ్యాయి.
ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఇలా…పగబట్టినట్లుగా కోవిడ్-19 విరుచుకుపడుతుండడంతో ఈ మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్ పై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఒమిక్రాన్ సోకితే మంచిదేనని…ఒమిక్రాన్ బారిన పడ్డవారిలో వచ్చే రోగ నిరోధక శక్తితో భవిష్యత్తులో రాబోయే డెల్టా వంటి అనేక ప్రమాదకర వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ లో ప్రపంచ దేశాలను వణికించిన ‘డెల్టా’ వేరియంట్ కొమ్ముల్ని కూడా ఒమిక్రాన్ వల్ల వచ్చే రోగ నిరోధక
శక్తి విరిచేస్తోందట.
ఇక, ఒమిక్రాన్ తో శరీరంలో పుట్టిన యాంటీబాడీలు డెల్టా, ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను అడ్డుకోవడంతో పాటు రీ ఇన్ ఫెక్షన్ రాకుండా రక్షణనిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. డెల్టా డామినేషన్ తగ్గిపోయిందని, ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒమిక్రాన్ ఆధారిత వ్యాక్సిన్ విధానాలను అమలు చేయాలని అభిప్రాయపడింది. ఒమిక్రాన్ సోకిన 39 మందిపై ఐసీఎంఆర్ చేసిన స్టడీలో ఐజీజీ యాంటీబాడీలను, వైరస్ ను మట్టుబెట్టే న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలను కూడా పరిశోధకులు గుర్తించారు. అందరిలోనూ న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలు.. అన్ని వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొన్నాయని నిర్ధారించారు. దీంతో, సర్ప్ ఎక్సెల్ యాడ్ లో మరక మంచిదే లాగా…ఈ కరోనా కాలంలో ఒమిక్రాన్ సోకడమూ మంచిదేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.