ఏ ఇద్దరు నేతలు కలిసినా.. ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మరోసారి కదలిక వచ్చింది. ఇప్పటికే మంత్రులతో మాట్లాడి ఈ విషయంలో సీఎం జగన్ కన్ఫర్మ్ చేసుకున్నారు. వారి నుంచి ఎలాంటి భేదాభిప్రాయా లు రాలేదు. సో.. ఇక ముందుకే అన్నట్టుగా ప్రకటనకు కూడా తయారు అయ్యారు. అయితే.. ఇప్పటిలో ఇది సాధ్యం కాదని.. అన్ని వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో జనాభా గణన పూర్తి కావాల్సిన అవసరం ఉంది.
నిజానికి 2020 జనవరిలోనే జనాభా గణనచేయాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఇది వాయిదా పడింది. దీంతో జన గణన జరిపితే తప్ప.. జిల్లాల విభజన వద్దని.. కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు రెండేళ్లుగా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా సాగుతోంది. అయితే.. తాజాగా మరోసారి జగన్ దీనిని తెరమీదికి తెచ్చారు. మొత్తం 26 జిల్లాలుగా చేయాలనేది సీఎం అభిప్రాయంగా ఉంది. 2024 లోపు జనగణన పూర్తి అయ్యే అవకాశం లేనందున … జిల్లాల ఏర్పాటు కూడా సాధ్యం కాదు.
ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. అయితే.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని.. ఎన్నికలకు ముందునుంచి కూడా జగన్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే అడుగులు వేస్తున్నా.. జన గణన అంశం అవరోధంగా మారుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు ఇంత ఉత్సాహంగా ఎందుకు ముందుకు సాగుతున్నారు? అనేది నేతల మధ్య సాగుతున్న చర్చ. పైగా రేపో మాపో.. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అనుమతే కాదు, డబ్బులు కూడా లేవు
దీంతో ప్రస్తుతం రాజకీయంగా నెలకొన్న స్తబ్దత తొలగిపోతుందనేది వైసీపీ నేతల మాట. అయితే.. జిల్లాల ఏర్పాటు విషయంలో అనేక సందేహాలు వస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిని అమలు చేసేందుకు డబ్బులతో పని. గతంలో తెలంగాణలో ఇలానే 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించి.. రాష్ట్రం అప్పుల పాలైందనే విమర్శలు ఉన్నాయి. సాక్షాత్తూ.. సీఎం కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు.
జిల్లాల విభజనతో మనం కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఈ విషయం ఆర్థిక అంశాలతో ముడిపడింది. కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది.. ఇలా అన్నీ చేయాలి. సో.. ఇవన్నీ అయ్యేందుకు డబ్బుతో లింకులు ఉన్నాయి. మరి జగన్ వ్యూహం ఏంటనే విషయంపై నేతల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం.