కొత్త జిల్లాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో మరో 13(ప్రస్తుతం 13 ఉన్నాయి) కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఆన్లైన్లోనే మంత్రుల ఆమోదాన్ని స్వీకరించింది. ఆన్లైన్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు అందజేసింది. ఇదే సమయంలో సీఎస్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించే యోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం దీనికి కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు.
నిజానికి గతంలో తెరమీదికి వచ్చిన ఈ ప్రతిపాదనపై జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. జనాభా లెక్కల సేకరణ 2021 మే నాటికి పూర్తి కావలసి ఉండగా కొవిడ్ వల్ల వాయిదా పడింది.
అది ఎప్పటికి పూర్తవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ.. జగన్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విధించిన నిబంధనను అధిగమించి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలా ముందుకు వెళుతుంది? ఏమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోందా? అన్న విషయంలో స్పష్టత రావలసి ఉంది.
ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. అయితే అరకు లోక్సభ నియోజకవర్గం భౌగోళికంగా విస్తారమైనది కావడంతో… దాన్ని 2 జిల్లాలుగా చేయాలని ఇక్కడి మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గతంలోనే కోరారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాల్ని.. 26 జిల్లాలుగా చేయాలన్నది ప్రతిపాదన. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేసే క్రమంలో… కొన్నిచోట్ల ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న నగరంలో కొంత భాగం కొత్తగా ఏర్పడే జిల్లాల్లోకి వెళ్లనుంది. అంటే ఒక నగరం లేదా, పట్టణంలోని కొంత భాగం ఒక జిల్లాలోను, మరికొంత భాగం మరో జిల్లా పరిధిలోను ఉంటుంది.
ఈ సమస్యల పరిష్కారం విషయంలోనూ స్పష్టత రావలసి ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మరింత వేగం పెంచినట్లు కనిపిస్తోంది. కానీ, కేంద్రం విధించిన షరతు మాత్రం సర్కారు కాళ్లకు ప్రతిబంధకంగా మారింది. మరి ఏం చేస్తారో.. చూడాలి.