టీడీపీ అగ్రనేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అక్రమ అరెస్ట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. కొడాలి నాని క్యాసినోపై ప్రశ్నించినందుకు, నాని బూతులకు ప్రతి విమర్శలు చేసినందుకే వెంకన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బుద్ధా వెంకన్న అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. బుద్ధా అరెస్ట్ కుట్రపూరితమని, వెంకన్నను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని కేసినోపై ప్రశ్నించినందుకు అరెస్ట్ చేస్తారా? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా కొడాలి నాని కేసినోపై చంద్రబాబు మండిపడ్డారు. గుడివాడలో ఏమీ జరగకపోతే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని చంద్రబాబు నిలదీశారు. గుడివాడలో టీడీపీ నేతలపై దాడి చేసినవారిని వదిలేసి…నాని కేసినోపై నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని, తప్పు చేసిన పోలీసులు టీడీపీ అధికారంలోకి రాగానే విచారణ ఎదుర్కొనక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
అంతకుముందు తన అరెస్ట్ పై బుద్ధా వెంకన్న స్పందించారు. తన ఇంటికి పోలీసులు రావడంపై స్పందించిన బుద్ధా…ఏపీ పోలీసుల తీరు అత్యంత విచారకరమని అన్నారు. “విచ్చలవిడిగా క్యాసినో నడిపిస్తే నో పోలీస్… ప్రతిపక్ష నేతని మంత్రి కొడాలి నాని బూతులు తిట్టినా నో పోలీస్. నేను మీడియా సమావేశం పెట్టిన అరగంటకే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకున్నారని అర్థమవుతోంది” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత మంత్రి కొడాలి నానిపై వెంకన్న ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. “అరేయ్ కొడాలి నాని… నీ భాష ఏంటి, నీ చరిత్ర ఏంటిరా? గుడివాడలో ఆయిల్ దొంగవి నువ్వు… వర్ల రామయ్య నిన్ను లోపల వేసి చితకబాదాడు. పోలీసులు లేకుండా విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి… కొట్టుకుందాం! గుడివాడలో వ్యభిచార కంపెనీ తీసుకువచ్చావు, నోటిదూలతో కృష్ణా జిల్లా పరువు తీశావు” అంటూ నానిపై వెంకన్న చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.