వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. రఘురామపై సాయిరెడ్డి విమర్శలు చేయాలని ప్రయత్నించడం…సాయిరెడ్డి ట్వీట్లకు దిమ్మదిరిగే రేంజ్ లో ఆర్ఆర్ఆర్ కౌంటర్లివ్వడంతో ఈ ట్వీట్ల ఎపిసోడ్ రక్తికడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ పై రఘురామ దీటుగా కౌంటర్ ఇచ్చారు.
‘కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు. కానీ అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలుక ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే” అంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు రఘురామ తనదైన శైలిలో స్పందించి జగన్, సాయిరెడ్డిలను ఇరుకున పడేశారు.
‘కోడి కత్తిని అడ్డంపెట్టుకుని వచ్చిన మీరు ఇంత కన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపిస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా? లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా?’ అంటూ రఘురామ సెటైర్లు వేయడంతో సాయిరెడ్డి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో పీఆర్సీ వ్యవహారంపై రఘురామ స్పందించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులను విలన్లుగా చిత్రీకరిస్తారా? అవినీతి అధికారులంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తారా? అంటూ రఘురామ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో జీతాల్లో కోత విధించినా ఉద్యోగులు సహకరించారని, వారిపట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. జీతాలు తగ్గించినా, సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా విధులు నిర్వర్తించిన ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొడతారా? అని నిలదీశారు.
ఉద్యోగ సంఘాల ఆందోళన, సమ్మె నోటీసుల కంటే, మంత్రి కొడాలి నాని కామెంట్లకు, కేసినో వ్యవహారానికి ప్రాధాన్యతనివ్వడం హాస్యాస్పదమని ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు. వలంటీర్ల ద్వారా ఉద్యోగులపై విష ప్రచారం చేయిస్తున్నారని, పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకుని, పార్టీ పనులు చేయించుకోవడం సిగ్గుచేటని రఘురామ విమర్శించారు. మరి, రఘురామ తాజా ట్వీట్లకు విజయసాయి స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.