గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో వ్యవహారం పెను దుమారం రేపుతోంది. చంద్రబాబుపై నాని వ్యాఖ్యలకు కౌంటర్ గా నాని, డీజీపీ సవాంగ్ ల పై ఎమ్మెల్సీ , టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అరెస్టు తర్వాత వెంకన్నను విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం జగన్, కొడాలి నాని, డీజీపీలపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు వెంకన్నను అరెస్టు చేశారు.
ఆ కామెంట్లపై వివరణ అడిగేందుకు బుద్దా వెంకన్న నివాసానికి వెళ్లిన పోలీసులు…కొద్ది నిమిషాల్లోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, బుద్దా వెంకన్న అరెస్ట్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వెంకన్న ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.