ఏపీలో పీఆర్సీ రచ్చ ముదిరి పాకానబడిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తగ్గుతున్నాయి మహాప్రభో అంటూ ఉద్యోగులు మొత్తుకుంటుంటే…కొత్త పీఆర్సీ జీవోలపై తగ్గేదేలే అంటూ జగన్ సర్కార్ మొండిపట్టు పట్టి కూర్చుంది. దీంతో, ఈ పీఆర్సీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలోనే కొత్త పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
జీతాలు పెంచే అధికారం, తగ్గించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పీఆర్సీ పర్సంటేజ్లపై ఛాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని తేల్చి చెప్పింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పండి అంటూ ఉద్యోగుల తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. పూర్తి డేటా లేకుండా పిటిషన్ వేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అయితే, పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.
ఉద్యోగులకు జీతాలు పెరిగాయని, దీనికి సంబంధించిన లెక్కలను ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. కానీ, హెచ్ఆర్ఏ విభజన మాత్రం చట్ట ప్రకారం జరగలేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. కానీ, ఆ ఆరోపణలతో ఏకీభవించని హైకోర్టు…అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని ఆదేశించింది. పిటిషనర్ కృష్ణయ్యతో పాటు స్ట్రిరింగ్ కమిటీ సభ్యులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సమ్మె నోటీసు ఇచ్చిన 12 మంది కమిటీ సభ్యులు కూడా విచారణకు రావాలని ఆదేశించింది.