టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై వైసీపీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబులతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అధికారం ఉంది కదా అని నోరు అడ్డుపెట్టుకొని వారు చేస్తున్న జుగుప్సాకరమైన కామెంట్లపై విమర్శలు వచ్చినా…వారి తీరు మాత్రం మారడం లేదు. కొడాలి నాని అండ్ కో కామెంట్లపై పలువురు టీడీపీ నేతలు తమదైన రీతిలో దీటుగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ, పంటికి పన్ను….టైపులో కొడాలి నాని వంటి వారి నోరు మూయించగలిగిన సత్తా ఉన్న టీడీపీ నేతల పేర్ల లిస్టులో దివంగత నేత పరిటాల రవి పేరు ముందుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అనంతపురం రాజకీయాల్లో టీడీపీ నేతగా పరిటాల రవి వేసిన ముద్ర చరిత్రలో నిలిచిపోయిందనడం అతిశయోక్తి కాదు. అనంతలో కాంగ్రెస్ ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టిన పరిటాల రవి…అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో పసుపు జెండాను రెపరెపలాడించి…ప్రత్యర్థి రాజకీయ నేతలను గడగడలాడించారు.
ఆ పరిటాల రవిని కుట్రపూరితంగా హత్య చేయించి ఉండకుంటే, ఆయన బ్రతికి ఉంటే…ఈ రోజు కొడాలి నాని వంటి వారు నోరు మెదిపే ధైర్యం చేసేవారు కాదని టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పరిటాల రవి లేకుంటేనేం…ఆయన రాజకీయ వారసుడిగా ఆయన ఆశయాలను తనయుడు పరిటాల శ్రీరామ్ ముందుకు తీసుకువెళ్తున్నారని అనుకుంటున్నారు. జనవరి 24న పరిటాల రవి 17వ వర్థంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.
పరిటాల రవి వారసుడిగా పరిటాల శ్రీరామ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ బలమైన రాజకీయ నేతగా ఎదిగారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని దీటుగా ఎదుర్కొంటూ ప్రతి సవాళ్లు విసురుతున్నారు శ్రీరామ్. మొన్నటివరకు సొంత ఇళ్లు లేక అద్దె ఇంట్లో ఉన్న తోపుదుర్తి బ్రదర్స్ ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తున్నారని.. రాప్తాడు నుంచి బెంగళూరు వరకూ భూదందాలు చేస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు. పరిటాల రవి ఎమ్మెల్యే కాక ముందు నుంచే వ్యాపారాలు చేస్తున్నారని.. ఆయన చాలా కష్టాలు పడ్డ తర్వాత నిలదొక్కుకుకున్నారని శ్రీరామ్ అన్నారు.
పరిటాల కుటుంబం అంచెలంచెలుగా ఎదిగిందని, రాత్రికి రాత్రే వచ్చిన ఐశ్వర్యం కాదని శ్రీరామ్ దీటుగానే ప్రకాష్ కు జవాబిచ్చారు. తమ వ్యాపారలు రైట్ ట్రాయల్ గా ఉన్నాయని, ప్రతి దానికి ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు, వాటిపై అనుమానాలుంటే అధికారం నీదే కదా నిరూపించుకో అని ప్రకాష్ కు సవాల్ విసిరారు. తోపుదుర్తి సోదరుల ఆస్తులు, వ్యాపారాలు, దందాల గురించి మాట్లాడితే సమయం సరిపోదన్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు చేస్తే మూల్యం తప్పదని ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులు, బినామీలకు శ్రీరామ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో, పరిటాల శ్రీరామ్ రూపంలో పరిటాల రవి మళ్లీ పుట్టారని, ఆయన లేనిలోటు తీరుస్తారని పరిటాల కుటుంబం, టీడీపీ అభిమానులు అంటున్నారు.
కాగా, పరిటాల రవి వర్థంతి సందర్భంగా ఎవరూ వెంకటాపురం రావొద్దని మాజీమంత్రి సునీత కోరారు. ప్రతి ఏటా జనవరి 24న అభిమానులతో కలిసి వెంకటాపురంలో నివాళులు అర్పించేవారమని, కానీ, కరోనా థర్డ్ వేవ్ కేసులు పెరగుతున్న నేపథ్యంలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాలను జరపడం లేదని అన్నారు. అభిమానులు వెంకటాపురం రాకుండా ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే కరోనా నిబంధనలు పాటిస్తూ తమ అభిమాన నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు.