మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు .. రాజకీయం ఎటు మళ్లింది? ఏం జరుగుతోంది. గత కొన్నాళ్లు.. ఆయన పార్టీ మారిపోతారని, వైసీపీలోకి జంప్ చేస్తారని.. వ్యూహాత్మకంగా జగన్‌కు దగ్గర అవుతున్నారని.. పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. పోనీ.. ఆయన వెళ్లకపోయినా.. ఆయన కుమారుడిని మాత్రం ఖచ్చితంగా వైసీపీలోకి చేరవేస్తారని.. ఈ క్రమంలో వైసీపీకి మద్దతు దారుగా మారడం ఖాయమని కూడా గుసగుసలు వినిపించాయి.
కొన్ని సార్లు ఏకంగా ముహూర్తం ఫిక్సయిందని.. జగన్ అప్పాయింట్మెంట్ ఖరారు చేశారని.. ఇక, చేరడమే తరువాయని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఎందుకో అనూహ్యంగా గంటా విషయం ఇప్పుడు తెరమరుగైంది. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్లో గంటా లాబించారా? లేక నష్టపోయారా? అనేది కీలక అంశం.
ప్రస్తుతం ఉన్న చర్చల ప్రకారం.. గంటా శ్రీనివాసరావు.. టీడీపీలో ఉన్నప్పటికీ.. ఆయన మనసు మాత్రం అధికార పార్టీలో ఉందని అనేవారు తక్కువ మందే కనిపిస్తున్నారు. అయితే.. ఎప్పుడైతే.. ఆయన టీడీపీలోకి జంప్ చేస్తారనే వార్తలు వచ్చాయో.. అప్పటి నుంచి ఆయన ఒకటి రెండు సార్లు తాను పార్టీ మారేది లేదని.. చంద్రబాబు తోనే ఉంటానని చెప్పినా.. తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం.. దీనికి భిన్నంగా ఉన్నాయి. ఫలితంగా చంద్రబాబు ఆయనను కడు దూరం పెట్టారనేది తమ్ముళ్ల మాట. పార్టీ పార్లమెంటరీ పదవుల్లోనూ.. పార్టీ రాష్ట్ర కమిటీలోనూ గంటాకు ఛాన్స్ ఇవ్వలేదు. అంతేకాదు. పార్టీ తరఫున ఆయన కు ఆహ్వానాలు కూడా అందడం లేదు.
ఇక, గంటా విషయం చూస్తే.. ఆయనకూడా టీడీపీకి డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనడంలేదు. ప్రబుత్వంపై విమర్శలూ సందించడం లేదు. సో.. ఈ పరిణామాలు గమనిస్తే.. వైసీపీకి చేరువ అవుతున్నారనే భావన కనిపిస్తుంది. అయితే.. మరో కోణంలో చూస్తే.. వైసీపీ ప్రభుత్వం ఇటీవల గంటా సన్నిహితుడు కాశీవిశ్వనాథ్‌కు చెందిన ఓ రిక్రియేషన్ క్లబ్‌ను అర్ధరాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధమని కూల్చివేసింది. ఇక,, గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ విషయంలోనూ హార్ష్‌గానే సర్కారు వ్యవహరించింది. దీనిని బట్టి గంటానే చేర్చుకునే ఉద్దేశం వైసీపీకి లేదని స్పష్టమవుతోందని అంటున్నారు.
మరోవైపు.. వైసీపీ నేతలు గంటా రాకను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అవంతి శ్రీనివాస్ గంటాపై బహిరంగ విమర్శలే చేస్తున్నారు. విజయసాయి ఆదిలో ఆహ్వానించినా.. తర్వాత ఎందుకో వ్యతిరేకించిన సంకేతాలు వచ్చాయి. దీంతో గంటా విషయం ప్రస్తుతానికి పక్కదారి పట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. రెంటికి చెడ్డ రేవడిగా.. అంటే.. అటు టీడీపీలోను, ఇటు వైసీపీలోనూ కూడా గంటా మసకబారారా? అనే సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.