గుడివాడ రగడ.. ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. సంక్రాంతిని పురస్కరించుకుని గుడివాడలో గోవా తరహా క్యాసినో నిర్వహించారంటూ.. టీడీపీ నేతలు.. వైసీపీ మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజనిర్ధారణ కమిటీగా టీడీపీ సీనియర్ నేతలు.. శుక్రవారం గుడివాడలో పర్యటించారు. అయితే.. వీరిని అడ్డగించడం..తర్వాత.. టీడీపీ కార్యాలయంపై దాడి.. అన్నీ తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి.. తాను ఏ తప్పు చేయలేదని.. నిరూపిస్తూ.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ రువ్వారు.
దీంతో ఇప్పుడు టీడీపీ ప్రతిసవాల్ రువ్వింది. మేం సిద్ధమేనని, క్యాసినో నిర్వహించారని.. సో.. పెట్రోల్ పట్టుకుని వస్తే.. నిరూపిస్తామని.. మంత్రి నానికి టీడీపీ ప్రతిసవాల్ విసిరింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. కొడాలిపై విరుచుకుపడ్డారు. నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రెండు వేల మంది వైసీపీ మూకలు.. టీడీపీ కార్యాలయంపై ఎలా దాడి చేశారని..ఆయన నిలదీశారు.
‘‘కొడాలి నాని దొంగ. దొరికిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రి సవాల్‌ను స్వీకరిస్తున్నాం. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు రావాలో చెప్పండి. చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం. క్యాసినోలో డ్యాన్స్‌లు వేసిన వారి పేర్లూ మా వద్ద ఉన్నాయి. విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్‌లు వేశారు. కరోనా వచ్చిందని హైదరాబాద్‌లో ఉంటే చేసిన తప్పులు పోతాయా?“ అని ఉమా.. కొడాలిపై నిప్పులు చెరిగారు.
క్యాసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు నేను సిద్ధం. రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయి చాలు. క్యాసినో జరిగిందని మీడియా సమక్షంలో నిరూపణకు సిద్ధం. అర్ధనగ్న నృత్యాలు జరిగితే తానే ఆపించానని నాని ఒప్పుకొన్నారు’’ అని బొండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్వెన్షన్ సెంటర్లో జరిగిన క్యాసినో వీడియోలను ఉమా మీడియాకు విడుదల చేశారు.
గోవా తరహా జూదాలకు, రాయలసీమ తరహా రౌడీయిజానికి గుడివాడను వేదికగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ద్వజమెత్తారు. బూతులు తిడుతున్న బూతుల మంత్రి కొడాలి నానిని అదుపు చేయడంలో సీఎం జగన్ విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన గుడివాడలో అరాచక శక్తులు రాజ్యమేలుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్యాసినో జూదాలపై నిజ నిర్ధారణ చేసేందుకు వెళ్లిన తమను అరెస్ట్ చేసిన పోలీసులు తమపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు.