ఇప్పుడంతా విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ నటీనటులు.. సెలబ్రిటీలు ఇటీవల కాలంలో వరుస పెట్టి విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్.. బాలీవుడ్ లలో అలవాటైన విడాకులు.. ఇటీవల కాలంలో దక్షిణాది చిత్ర రంగంలోనూ ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. కొద్దినెలల తేడాతోనే ప్రముఖ జంటలు విడిపోవటానికి డిసైడ్ అవుతున్న వైనం హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే.
ఇలాంటివేళలో.. హాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నటి తన ఐదో పెళ్లిని పెటాకులు చేసుకున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తన ఐదో పెళ్లిని ఏడాది కాకుండానే.. విడిపోతున్న వైనాన్ని వెల్లడించింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హాలీవుడ్ నటి పమేలా అండర్సన్. ఇప్పటికే నాలుగుసార్లు విడాకులు తీసుకున్నఆమె.. ఐదో భర్తకు విడాకులు ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కోర్టును ఆశ్రయించారు కూడా.
నాలుగు పెళ్లిళ్లు చేసుకొని.. వారితో విడిపోయిన పమేలా.. లాక్ డౌన్ వేళ.. తన బాడీ గార్డు డానే హేహర్ట్స్ కు దగ్గరైంది. అతడితో ప్రేమలో పడిన ఆమె.. లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకున్నారు. 54 ఏళ్ల వయసులో ఉన్న ఆమెకు ఐదో పెళ్లి సైతం ఆమెకు కలిసి రాలేదు.
ఎక్కువ కాలం నిలవకుండానే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో విడిపోవటానికి నిర్ణయం తీసుకున్నారు. ఐదో పెళ్లి బంధాన్ని తెగ తెంపులు చేసుకోవటం కోసం కోర్టును ఆశ్రయించిన వైనం హాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది.
పమేలా పెళ్లిళ్ల హిస్టరీ చూస్తే.. ఆమె తొలిసారి 1995లో టామీ లీ అనే అమెరికా నటుడ్ని పెళ్లాడింది. మూడేళ్లకే ఆ బంధానికి బీటలు ఏర్పడ్డాయి. అప్పటికే వారికి ఇద్దరుపిల్లలు ఉన్నారు. అనంతరం తన రెండో పెళ్లిని 2006లో సింగర్ కిడ్ రాక్ ను పెళ్లాడింది. అయితే.. ఏడాదికే అతడితో తెగ తెంపులు చేసుకున్న ఆమె.. 2014లో అమెరికన్ పోకర్ ప్లేయర్ రిక్ సాలోమన్ ను పెళ్లాడారు. ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. ఏడాదికే విడాకుల వరకు వెళ్లిన ఆమె.. నాలుగోసారి నిర్మాత జాన్ పీటర్స్ ను 2020లో రహస్యంగా పెళ్లాడారు.
ఎప్పటిలానే ఏడాదికే తేడా రావటంతో.. అతడితో విడిపోయారు. అనంతరం కరోనా.. లాక్ డౌన్ నేపథ్యంలో తనకు బాడీగార్డుగా వ్యవహరించే వ్యక్తినే పెళ్లాడారు. ఐదో పెళ్లి సైతం ఏడాది సిండ్రోమ్ ను దాటలేకపోయింది. తాజాగా అతడికి విడాకులు ఇచ్చేందుకు రెఢీ కావటంతో.. ఆమె ఐదో పెళ్లి సైతం పెటాకులైన పరిస్థితి. రానున్న రోజుల్లో మళ్లీ పెళ్లి వార్తతో మీడియాలో ఆమె పేరు వినిపిస్తుందేమో?