రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులను ఒకేలా ఉంచుకోవాలంటే.. నేతలు నిత్య నూతనంగా ఉండాలంటే.. చాలా కష్టించాలి. అయితే.. ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. సో.. ఎదురీత లేక.. తట్టాబుట్టాసర్దుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇక, ఇలాంటి పరిస్థితే.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన కరణం బలరామకృష్ణమూర్తి విషయంలో కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ తరఫున గెలిచినా.. ప్రస్తుతం కరణం కుటుంబం వైసీపీకి మద్దతుదారుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి వైసీపీ టికెట్ ఇప్పించుకునేందుకు కరణం ఈ పార్టీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. ఆయన పార్టీలోకి వచ్చినప్పటికి.. ఇప్పటికి.. ఈ ఫ్యామిలీలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నా య ని అంటున్నారు పరిశీలకులు. వైసీపీలోకి వచ్చినప్పుడు దూకుడుగా వ్యవహరించారు కరణం, ఆయన కుమారుడు వెంకటేష్‌లు. వైఎస్సార్ వర్ధంతి, జగన్ పాదయాత్రకు సంఘీభావ సూచకంగా `ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు` వంటి కార్యక్రమాలలో కరణం బలరాం వర్గం చురుగ్గా పాల్గొంది. పార్టీ తరఫున ఎలాంటి పిలుపు వచ్చినా.. వెంకటేష్ ముందుండే వారు.
ప్లెక్సీల ఏర్పాటు లో కూడా పోటీ పడ్డారు. ఇక బలరాం బర్త్ డే సందర్బంగా చీరాలంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. అయితే ఆశ్చర్యకరం గా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలకు మాత్రం కరణం కుటుంబం.. దాదాపు ముఖం చాటేసిందనే అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి వైసీపీనే.. అన్నినియోజకవర్గాల్లోనూ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని అధికారికంగా ప్రకటన ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, బియ్యం పంపిణీ, పేదలకు బట్టల పంపిణీ చేపట్టి.. జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అయితే.. కరణం కుటుంబం మాత్రం దీనిని మొక్కుబడిగా కానించేసిందనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ఇక కరణం విషయానికొస్తే ఆయన తన వర్గీయుడైన డాక్టర్ వరికూటి అమృతపాణితో వేడుకలకు ఏర్పాట్లు చేయించారు. ఇక, బలరాం రాకపోగా వెంకటేష్ హాజరయ్యారు. అయినప్పటికీ.. ఆయన కూడా ముక్తసరిగా వ్యవహరించారు.
దీంతో వైసీపీపై కరణానికి మోజు తగ్గిపోయిందా? లేక ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. చీరాలకి సంబంధించినంత వరకు తమకు వైసీపీ హైకమాండ్ వద్ద సానుకూలత లేదని, ఆమంచికి వ్యతిరేకంగా తాము కదుపుతున్న పావులు వర్కవుట్ కావడం లేదని బలరాం వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమంచిని తప్పించి చీరాలలో వైసీపీ పగ్గాలు తమకు అప్పగించాలన్న డిమాండ్ నెరవేరే సూచనలు కానరాకపోవడంతో ఇక, పార్టీలో ఉండడం కన్నా.. తమ దారి తాము చూసుకోవడమే బెటర్ అని కరణం వర్గం భావిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.