భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ చేసిన వివాదాస్పద కామెంట్లు కొద్ది రోజుల క్రితం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ను పలువురు ప్రముఖులు, సినీ నటులు, జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా తప్పుబట్టాయి. సిద్ధార్థ్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విటర్ ఇండియాకు ఎన్ సీ డబ్ల్యూ చైర్మన్ రేఖ లేఖ కూడా రాశారు.
దీంతో, చివరకు దిగివచ్చిన సిద్ధార్థ్ సైసైనాకు సారీ చెబుతూ ఓ లేఖను ట్వీట్ చేశాడు. సైనాపై తాను వేసింది బ్యాడ్ జోక్ అని అంగీకరించినా…తన ట్వీట్లో లింగవివక్ష లేదంటూ సమర్థించుకున్నాడు. దీంతో, ఆ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ కు చెన్నై పోలీసులు షాకిచ్చారు. సిద్ధార్థ్‌కు సమన్లు జారీచేసినట్టు చెన్నై నగర పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ వెల్లడించారు.
సైనాపై సిద్ధార్థ్ వ్యాఖ్యలు మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీకి ఎన్ సీడబ్ల్యూ లేఖ రాసింది. ఆ లేఖలోని ఫిర్యాదు ఆధారంగా తాజాగా సిద్ధార్థ్ కు సమన్లు జారీ అయ్యాయి. అయితే, తమిళనాడులో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో సిద్ధార్థ్‌ను ఏ విధంగా విచారణ జరపాలన్న విషయంపై పోలీసులు ఆలోచిస్తున్నారట. మరి, ఈ సమన్లపై సిద్ధార్థ్ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.