బ్రహ్మానందం చెప్పినట్టు, బాగా డామేజ్ అయిపోయాక, సగం జీవితం సంకనాకిపోయాక, ఇక మన వల్ల ఏం కాదు అని డిసైడ్ అయిపోయాక చంద్రబాబు ఎన్నుకుంటాం కానీ నిజానికి చంద్రబాబు మీద మనకున్న అభిమానం తక్కువ.
బాబుతో అవసరమే ఎక్కువ. ఎందుకంటే, చంద్రబాబుది పెద్ద సోది యవ్వారం. చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకొని వెళ్లాలి, పోటీ పడాలి, డ్యూటీ చేయాలి, ఆకాశాన్ని అందుకోవాలి, పాయసం వండుకోవాలి లాంటి కబుర్లేవో చెబుతాడు. మాట్టాడేది తెలుగేకానీ ఇదంతా బొత్తిగా మనకి పరిచయం లేని భాష. తేరగా పంచడం, వరస పెట్టి దంచడం బొత్తిగా తెలియని మనిషి. అలాగని బాబు మీద జాలి పడక్కర్లేదు.
చంద్రబాబు ఆంధ్రుల మనసు చదవలేని నిరక్షరాస్యుడు. చంద్రబాబు ఆలోచనలకి హైటెక్కువ. ఆంధ్రుల ఆశలకి లోతెక్కువ. ఈ హైటుకు ఆలోటుకి పొత్తు ఎప్పుడో కానీ కుదరదు. ఎందుకంటే ఒకరికొకరికి అండర్ స్టాండింగ్ తక్కువ. బాబు వీళ్లకి అర్థం కాడు. వీళ్లను బాబు అర్థం చేసుకోడు. సింపుల్. ఆంధ్రులు బేసిగ్గా స్పెషల్ స్పీషెస్.
తెలుగులో ఏడుద్దాం. ప్రత్యేకమైన జాతి. విచిత్ర జాతి. తమకి ఏం కావాలో ఆలోచించుకోరు. పక్కనోడు ఏం కోరుకుంటున్నాడో తెలుకునేంత వరకూ ఊరుకోరు. ఆఖరికి హోటల్ కి వెళ్లినా చూడండి, మనకేం కావాలో చెప్పే ముందు పక్కనోళ్లు ఏం తింటున్నారో ప్లేట్లన్నీ కలియచూస్తాం. నా దగ్గరున్న బంగారం అక్కర్లేదు.
నీ దగ్గరున్న నరవత్నం కావాలి అనేటైపు. మన పిల్లల్ని ఏ ఇంటర్లోనో జాయిన్ చేయాలంటే పక్కింటోడు ఏం చేశాడో, మనకి తెలిసినవాళ్లు ఏం చదివిస్తున్నారో కనుక్కుంటాం ముందు. మనం ఏం చేయాలి అనే దానికన్నా కూడా మనకి తెలియకుండా వాళ్లు ఏం చేసేస్తున్నారో అని ఆతృత ఎక్కువ. చదువు-సంధ్య, డబ్బు-గబ్బు, ఆస్తులు-దోస్తులు… ఒక్కటేమిటి అన్నిట్లోనూ ఇదే వరస మనకి. ఉన్నదాన్ని వాడుకోవడం ఎలాగో చూసుకోవడం కన్నా లేనిదాని కోసం ఏడవడం ఎక్కువ. చంద్రబాబుతో చెడ్డ చికాకు ముందు నుంచి.
అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ సారి చెప్పాడు, నేను చేపల పులుసు పంచిపెట్టాలనుకోను. చేపలు పట్టడం నేర్పాలనుకుంటానూ అని. ఇది చైనా సామెత.
బువ్వ పెడితే పూట గడుస్తుంది. బుద్ధి నేర్పితే బతుకు నడుస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఆలోచించాలి, పని చేయాలి, ట్రెండ్ పట్టుకోవాలి, ప్రపంచాన్ని ఏలాలి లాంటివి చెబుతాడు. మనకి ఆ సబ్జెక్టు ఎక్కదు. పీకి పక్కనెడతాం. అంగన్ వాడీలో గుడ్డు ఇవ్వలేనోడు అమ్మజడ – నాన్న వడ ఇస్తానంటే నమ్ముతాం. కష్టపడితే వంద వస్తదిరా అంటే వద్దంటాం. తేరగా రూపాయి ఇస్తానంటే పరిగెడతాం.
మన నేచర్ ముందు నుంచి. కియా లాంటి ప్రాజెక్టులు తెచ్చి, పెద్ద రోడ్లు వేసి, ఓ పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తే – ప్రతీ జిల్లాలో గజం వేల్యూ సగటున 20 నుంచి 35 వేలు పెరిగిన రోజులున్నాయ్ 2018 నాటికి. కానీ అమరావతిలో ఐదు కోట్లు అయ్యిందట ఎకరం అనే పుకారు దెబ్బకి కంచంలో కూడు కిందేసుకున్నాం. మబ్బు చూసి ముంత ఒలకబోసుకోవడం అంటే ఇదే. పుకారు పుట్టించినోడు షికారు చేస్తన్నడు బాగానే, నేలనాకి పోయింది మనమే. బేసిగ్గా మనకి ప్రైడ్ అనే మాటకి అర్థం తెలియదు.
నీకు హిందా రాదా అని ఓ టెలిఫోన్ ఆపరేటర్ అన్నాడని మన పక్క రాష్ట్రంలో 48 గంటల్లో 38 లక్షల మంది ఆగ్రహించారు. యాప్ అన్ ఇన్ స్టాల్ చేశారు. మాంసం తినడం వాస్కోడగామా నేర్పాడు అన్నదని ఓ పార్టీని జీరోకన్నా దిగవకు దిగేసింది ఇంకో రాష్ట్రం. ఓ నటుడు అర్థాంతరంగా వెళ్లిపోతే – నువ్ మన రాష్ట్రానికి ప్రతిష్ట అంటూ కన్నీళ్లు పెడతాడు ఓ సీఎం. మా ఆత్మగౌరవం అంటూ మన పక్కన ఉన్నవాళ్లు ఎకమై 14 ఏళ్లలో సొంత జెండా ఎగరేశారు.
మరి మనం దేశమంతా గౌరవించేవాణ్ని – ఇంగ్లిష్ రాదని వెటకారం చేస్తాం. దేశంలో అతి పెద్దగా, 5 వేల కోట్లతో ఓ బ్రాండ్ తెస్తే … ల్యాండ్ దొబ్బేశారంటాం, మొబైల్ కంపెనీలు అన్నీ ఇక్కడే తయారవుతున్నాయ్ అని చాటి చెప్పే సమయంలో తప్పు దొర్లిందని పప్పు ముద్రలేసి ప్రచారం చేస్తాం. రాజధానికి కులం రంగువేస్తాం. దివాళా తీసే స్థితికొచ్చినా ప్రాంతాల వారీగా కొట్టుకుంటాం.
ఎందుకంటే మనం మన అనే మాటలో మ మర్చిపోయాం. న మాత్రమే గర్తుపెట్టుకున్నాం. అందుకే కలిపి నడిపేవాడు మనకొద్దు. విడకొట్టి పడగొట్టేవాడివైపే మొగ్గుతాం. ఎందుకంటే ఆంధ్రులకు ఆశ పెట్టేవాడు కావాలి. అవకాశాలు చూపించేవాడు కాదు.
ఆంధ్రులకి పంచి పెడతా అనేవాడు కావాలి, మిమ్మల్నీ, మీ స్థాయినీ పెంచి చూపిస్తా అనే వాడు కాదు. ఆంధ్రులకి కులం కుర్చీలో కూర్చొని కుమ్ములాట పెట్టేవాడు కావాలి. కష్టపడటమే నా గురుకులం అనేవాడొద్దు. ఆంధ్రులకి ఇల్లు కట్టేవాడొద్దు. పాత ఇంటికి కొత్తగా పన్ను కట్టు అనేవాడు కావాలి.
మనకో మహానగరం కావాలి అని పునాదులు వేస్తాడు బాబు. మనం మాత్రం మన నగరానికి మహా అని బోర్డు తగిలిస్తే చాలనేవాడిని నెత్తినపెట్టుకుంటాం. బోర్డు మారిస్తే ఏం వస్తది బొంగు !
అతి తెలిసి తేరుకునే సరికి తెల్లారతది. అబ్బో, చెబితే చిట్టా చాలా ఉంది. ఒక్క మాటలో అనాలంటే, వీడు-కీడు, ఎయిడెడ్ స్థలాలు వాడు లాంటి పథకాలతో బడి పోయింది.
రాబడి లేక రాష్ట్రం దెబ్బతిని పోయింది. ఇప్పుడు ఆంధ్రులు అనే మాటలో క్రావడి (రా వత్తు) కూడా పోతోంది.