ఈ టెక్ జమానాలో ప్రపంచ దేశాలన్నీ 4జీ టెక్నాలజీ నుంచి 5జీ టెక్నాలజీ వైపు దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలో 5జీ టెలీ కమ్యూనికేషన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అమెరికా టెక్ దిగ్గజాలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు యూఎస్ఏలోని అన్ని రాష్ట్రాల్లో 5జీ సేవలు నేడు ప్రారంభించాయి. అయితే, 5జీ సిగ్నల్స్ వల్ల విమానాల్లోని సిగ్నల్స్ కు అంతరాయం కలుగుతుందని భారత్ సహా పలు దేశాల ఎయిర్ లైన్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ల్యాండింగ్, టేకాఫ్, ప్రయాణ సమయంలో ఇబ్బందులు రావచ్చని, నావిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి. సిగ్నల్ ఇంటర్ఫియరెన్స్ ఉండొచ్చని భారత్ సహా పలు దేశాల విమానయాన సంస్థలు అభ్యంతరం తెలిపాయి. దీంతో, అమెరికా వెళ్లాల్సిన 14 విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఆ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్న ఆ సంస్థలు ఎయిర్ పోర్టు పరిసరాల్లో 5జీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. అమెరికాలోని కీలక విమానాశ్రయ ప్రాంతాల్లో ఈ 5జీ సేవలు పనిచేయవని వెల్లడించాయి.
ఈ క్రమంలోనే తాజాగా భారత్ నుంచి అమెరికాకు విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. అయితే, భారత్ సహా మరికొన్ని దేశాలు విమానాల్లో 5జీ సిగ్నల్స్ కు తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థను స్వల్పంగా మార్చుకోవాల్సి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 5జీ సేవల వల్ల ఈ విమాన సర్వీసులకు ఇబ్బంది తక్కువేనని, కానీ, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని విమానాశ్రయాల్లో ఆ సేవలు ఆపడమే మేలని అంటున్నారు. జపాన్ సహా పలు దేశాల విమానయాన సంస్థలకు ఎటువంటి అభ్యంతరం లేదు.