గుడివాడలో గోవా వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి సంబంధించిన కె కన్వెన్షన్ లో కేసినోతోపాటు జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు..వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. గోవాను తలపించేలా గుడివాడలో ఈ తతంగం సాగుతోందని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
కొడాలి నాని అంటే తనకు తెలీదన్న వర్మ…తాజాగా నానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లారని, కానీ గోవా ప్రజలు గుడివాడకు రాలేరు కదా అంటూ వర్మ సెటైర్ వేశారు. క్యాసినో కోసం గోవా ప్రజలు గుడివాడ వచ్చేలా గుడివాడ సంస్కృతిని ఆధునీకరించే ప్రయత్నం చేసిన మంత్రి నాని గారిని మెచ్చుకోవాలంటూ వర్మ కితాబిచ్చారు. ఈ విషయంలో నానిపై ఆరోపణలు చేస్తున్న వారికి వర్మ సూటి ప్రశ్న వేశారు.
క్యాసినోలు ఉన్న గోవా, లాస్ వేగాస్లను నగరాలను ఎవరైనా తప్పుగా చూస్తారా..? అని వర్మ ప్రశ్నించారు. వాటితో సమానంగా గుడివాడను ముందుకు తీసుకెళ్తున్న కొడాలి నానిని ఎవరైనా అభినందించాల్సిందేనని అన్నారు. గుడివాడను ఆధునీకరించాలన్న కొడాలి నాని సంకల్పం మంచిదని, ఎవరు విమర్శలు చేసినా పట్టించుకోవద్దని నానికి ఆర్జీవీ సూచించారు. ఇక, జై గుడివాడ అంటూ ఆర్జీవీ తనదైన మార్క్ కామెంట్లతో ట్వీట్ చేశారు. అయితే, కోవిడ్ నుంచి కోలుకున్న కొడాలి నాని..టీడీపీ నేతలు, వర్మ కామెంట్లపై ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.