మంత్రి కొడాలి నానికి సంబంధించిన కె-కన్వెన్షన్ హాల్లో కేసినో వ్యవహారం ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి పండుగనాడు మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాల్ మినీ గోవాను తలపించేలా క్యాసినో ఏర్పాటు చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ఫంక్షన్ హాల్లో కోడి పందేలు, పేకాట శిబిరాలు, ప్రత్యేకంగా క్యాసినోలు, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేశారని, దాదాపు 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గోవాను తలపించేలా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడిచిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కె-కన్వెన్షన్ సెంటర్లో కేసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జూదం, అసభ్య నృత్యాల వంటి వాటి వల్ల రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు.తెలుగు సంస్కృతిని దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని పోలీసులు ఉపేక్షించ కూడదని అన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారుఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక అధికారిగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు నియమించారు.