విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు పరమపదించి నేటికి 26 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి…ఢిల్లీ గులాంగిరీకి చెక్ పెట్టిన అన్నగారు 1996 జనవరి 18న ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ నివాళులర్పించిన లక్ష్మీపార్వతి సంచలన విషయాలు వెల్లడించారు.
ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తాను ఆయన ఆత్మతో మాట్లాడానని లక్ష్మీ పార్వతి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని, ఎన్టీఆర్ చనిపోయిన తర్వా జీవిత, రాజశేఖర్లు తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనలో అనేక విషయాలు పంచుకుందని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులు ఎవరు చేసినా తప్పేనని లక్ష్మీపార్వతి ఖండించారు. ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలని అన్నారు. ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించాలని లక్ష్మీ పార్వతి కోరారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయిలో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించిన సంగతిని లక్ష్మీ పార్వతి ఎందుకు చెప్పారననదానిపై చర్చ జరుగుతోంది.