2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వివేకా ఎలా చనిపోయారో డాక్టర్లు, పోలీసులు నిర్ధారించకముందే ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు మరికొందరు కామెంట్లు చేయడం కలకలం రేపింది. ఆ నేపథ్యంలోనే తాజాగా విజయసాయిరెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా గుండెపోటుతో మరణించారని ముందుగా ప్రకటించింది విజయసాయి అని, కానీ, ఆ తర్వాత వివేకా గొడ్డలి పోటుతో మరణించారని తెలిసిన తర్వాత మాట మార్చారని ఆర్ఆర్ఆర్ విరుచుకుపడ్డారు. అంతేకాదు, అది మర్డర్ అని తెలియగానే, దానిని టీడీపీ నేతలపైకి నెట్టేశారని మండిపడ్డారు. వివేకాను చంపిందెవరో అందరికీ తెలుసని, సీబీఐ విచారణలో చాలామంది వైసీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయని అన్నారు.
ఏదేమైనప్పటికీ గొడ్డలిపోటును గుండెపోటు అని ఎందుకు చెప్పావ్ విజయసాయిరెడ్డీ అని రఘురామ ప్రశ్నించారు. ఎవరిని కాపాడటానికి హత్యను టీడీపీపైకి తోసే ప్రయత్నం చేశారో చెప్పాలని నిలదీశారు. వివేకాను చంపిందెవరో త్వరలోనే వెలుగులోకి వస్తుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, అందుకే ఢిల్లీకి రావాల్సి వచ్చిందని అన్నారు.