యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు పెను దుమారానికి కేంద్ర బిందువయ్యారు. బికినీ గర్ల్ గా పేరు పొందిన తమిళ నటి అర్చన గౌతమ్ కు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ టికెట్ ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. యూపీలోని మీరట్ జిల్లాలో ఉన్న హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అర్చనా గౌతమ్ పోటీ చేయడంపై బీజేపీ, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి జాబితాలో చోటు దక్కిన 50 మంది మహిళలలో అర్చనా కూడా ఉన్నారు. దీంతో, కాంగ్రస్ కు ప్రజా సేవ అనే భావనే కనిపించడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మానసికంగా దివాలా తీసిన పార్టీ నుండి గొప్ప పనులను ఆశించలేమని దుయ్యబడుతున్నారు. హస్తినాపూర్ పవిత్ర ప్రాంతమని, అర్థనగ్న ఫొటోలను పోస్టు చేసే ఈ మహిళ తీరు వల్ల.. హస్తినాపూర్ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోడల్, నటి అయిన అర్చనను దక్షిణాదికి సన్నీ లియోన్ అని పిలుస్తారు. అడల్ట్ కామెడీ చిత్రం గ్రేట్ గ్రాండ్ మస్తీతో అర్చన బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. కొన్ని హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన అర్చన….హసీనా పార్కర్, బారాత్ కంపెనీ సినిమాలతోపాటు సాథియా సాథ్ నిభానా, కుబూల్ హై, సీఐడీ మొదలైన టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన అర్చన….2014లో మిస్ ఉత్తరప్రదేశ్ టైటిల్, 2018లో మిస్ బికినీ ఇండియా టైటిల్, 2018లో మిస్ కాస్మోస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన అర్చన…నవంబర్ 2021లో తిరిగి పార్టీలో చేరింది.