ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి నియమితులయ్యారు. ఈమె ఎవరో తెలుసుకదా… జగన్ కేసుల్లో అత్యధిక కాలం జైల్లో గడిపిన ఐఏఎస్ అధికారి. జగన్ ఆమెను ఏపీకి అదేపనిగా రప్పించుకున్నారు. అసలు ఈమె కోసం జగన్ ప్రత్యేకంగా ఢిల్లీ పెద్దలను కోరి ఏపీకి కేటాయించుకున్నారు.
ఇక సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలిచ్చింది. చీఫ్ సెక్రటరీ కాబోతున్న ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం జలవనరుల శాఖ చూస్తున్నారు. ఖాళీ కాబోయే ఆయన స్థానంలో జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు నియమితులయ్యారు.
IAS అధికారి శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపిలో పనిచేయాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ తో ప్రస్తావించినపుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలంగాణా సీఎం కేసీయార్ కూడా ఆమె విజ్ఞప్తికి ఓకే చెప్పారు. కానీ కేంద్రప్రభుత్వంలోని డీవోపీటీ మాత్రం అంగీకరించలేదు. దీంతో జగన్ చొరవ తీసుకుని ఢిల్లీ పెద్దలను ఆమెను ఏపీకి పంపమని కోరారు.
ఇక శ్రీలక్ష్మి జైలు జీవితం నరకప్రాయంగా సాగింది. ఆమె బాగా కుంగిపోయారు. దీంతో ఆ కాలంలోనే శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది. కోర్టు విచారణకు కూడా ఆమె వీల్ కుర్చీలో హాజరయ్యారు. ఈ దృశ్యం చూసి అందరూ విస్తుపోయారు. మానసికంగా కూడా ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.
దీనికంతటికి కారణం జగన్ కేసులు. మరి అలాంటిది చివరకు ఆమె జగన్ వద్దనే పనిచేయాలని కోరుకోవడం, పట్టుబట్టి పోస్టింగ్ తెచ్చుకోవడం… ఇవన్నీ చూస్తుంటే కాస్త విచిత్రంగానే అనిపిస్తోంది సామాన్యులకు!