రోటీన్ హీరోయిజానికి భిన్నంగా ఉంటాయి మాస్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ మూవీలు. మొదటి మూవీ.. ‘వెళ్లిపోమాకే’లో లవర్ బాయ్ గా పరిచయమైనప్పటికీ.. ఆ తర్వాత రూటు మార్చాడు. ఈ నగరానికి ఏమైంది… ఫలక్ నుమా దాస్.. హిట్.. పాగల్.. ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేనట్లుగా మూవీలు చేస్తున్న అతనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
తాజాగా అతడు చేస్తున్న మూవీ.. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. ఇందులో వడ్డీ వ్యాపారిగా నటిస్తున్న విశ్వక్ సేన్.. మూవీలో మాత్రం ‘అర్జున్ కుమార్’ పేరుతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లను కాస్త భిన్నంగా సిద్ధం చేయటం తెలిసిందే.
కథకు తగ్గట్లు మూవీని ప్రమోట్ చేస్తూ.. దీనిపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. పెళ్లి కోసం ‘చింత మ్యారేజ్ బ్యూరో’ను సంప్రదించినట్లుగా ఫస్ట్ లుక్ లో చూపించిన చిత్ర బృందం.. రెండురోజుల క్రితం విడుదల చేసిన ప్రచార చిత్రం అందరిని అలరించింది.
‘ఇంకా రెండో రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి’ అంటూ వీడియోను ట్వీట్ చేయటం.. అది కాస్తా వైరల్ గా మారి.. అందరూ సినిమా గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది. సంక్రాంతి పండుగ వేళ.. పిల్ల దొరికేసిందంటూ హీరోయిన్ ను రివీల్ చేశారు.
పసుపులేటి మాధవిగా రుక్సార్ దిల్లాన్ అలరించనుంది. అంతకు ముందు కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ సినిమాల్లో నటించిన రుక్సార్ ను హీరోయిన్ గా అధికారికంగా ప్రకటిస్తూ.. టీజర్ ను విడుదల చేశారు.
అందులో దొరికింది.. పిల్ల దొరికిందంటూ సంబరపడిపోతుంటే.. దొరికే వరకు ఒక బాధ.. దొరికిన తర్వాత వెయ్యి పదహారు బాధ.. ఉన్నవి కూడా ఊడిపోతాయ్ అన్నమాటతో మనోడు కాస్తంత కన్ఫ్యూజ్ కావటం.. అంతలోనే.. తనకు దొరికిన పిల్ల గురించి ఎగ్జైట్ అయిపోతూ చెబుతూ.. బాగుంటుందంటూ చెప్పిన వైనం.. ఆ తర్వాతి షాట్ లో రుక్సర్ నుచూపించిన సీన్ చూసినంతనే.. ఫీల్ గుడ్ మూవీలా అనిపించటం ఖాయం. మొత్తానికి విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ వెళుతున్న ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ తనదైన బజ్ ను సొంతం చేసుకోవటం ఖాయమన్నట్లుగా ఉంది.