సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 14 లోపు ఏపీలో రాక్షసపాలన అంతానికి అంకురార్పణ జరుగుతుందని జగన్ పాలనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కొందరి స్వార్థ రాజకీయాల వల్లే సంక్రాంతి జరుపుకోలేకపోతున్నానని వాపోయారు. జగన్, మెగాస్టార్ చిరంజీవిల భేటీ తర్వాతైనా పరిశ్రమపై దాడి ఆగిపోవాలని ఆర్ఆర్ఆర్ అన్నారు.
క్షవరం అయిందన్న సంగతి ఓటర్లకు ఆలస్యంగా తెలిసిందని, క్షవరం అయితే తప్ప ఉద్యోగులకు వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పీఆర్సీ కొనసాగితే చాలని ఉద్యోగులు భావిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందోనని చెప్పారు. హెచ్ఆర్ఏ తగ్గించి ఉద్యోగులకు జగనన్న శఠగోపం పెట్టారని, ఓటర్ల లాగానే ఉద్యోగసంఘాలు ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరులో ప్రజలకు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలవాలని, తనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడాలని రఘురామ పిలుపునిచ్చారు.
కేంద్రం నిధులను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నరసాపురం ప్రజలు మరోసారి తనకు మద్దతుగా నిలవాలని, ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సర్కారుకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోయేంతగా పరిస్థితులున్నాయని అన్నారు.
మరోవైపు, రఘురామ నరసాపురం ప్రకటించిన నేపథ్యంలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.