విభజన జరిగి ఏడేళ్లు దాటిపోయాయి. అయినా.. విభజన వేళ జరగాల్సినవి మాత్రం జరగలేదు. నేటికి ఇంకా ఆ ఇష్యూలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికి విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది.. పదిలోని సంస్థల విభజన జరగకపోవటం ఒక ఎత్తు అయితే.. ఆస్తుల పంపిణీకి సంబంధించి తెలంగాణ నుంచి తమకు నిధులు రావాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్రం చెప్పిన లెక్కలు కొత్త చర్చకు తెర తీశాయి.
తాజాగా ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేత్రత్వంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలుజరిగాయి. వీడియోకాన్ఫరెన్సులో జరిగిన ఈ భేటీలో కొత్త వాదనలు తెర మీదకు వచ్చాయి.
ఏపీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.3442 కోట్ల బకాయిలు రావాలని చెప్పటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మాటకు వస్తే తెలంగాణకే ఏపీ భారీగా అప్పు పడిందని లెక్కలు చెప్పింది. తాజాగా పేర్కొన్న వివరాల ప్రకారం తెలంగాణకు ఏపీ రూ.12,111 కోట్ల మేర అప్పు పడినట్లుగా పేర్కొన్నారు.
ఏపీ నుంచి తెలంగాణకురావాల్సిన నగదు బకాయిల గురించి తెలంగాణ అధికారులు ఏకరువు పెట్టారు. కేంద్ర పథకాలకు సంబంధించి రూ.495 కోట్లు ఇంకా రాలేదని.. హైకోర్టు.. రాజ్ భవన్ ల నిర్వాహణ వ్యయ బకాయిలు రూ.315 కోట్లు ఏపీ ఇవ్వాలని పేర్కొన్నారు.
అంతేకాదు.. నిర్మాణంలో ఉన్న సంస్థలకు సంబంధించి ఏపీ రూ.208 కోట్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇలా పలు సంస్థల నుంచి ఏపీ నుంచి తెలంగాణకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని వాటి గురించి లెక్క తేల్చాలని కోరటం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ సందర్భంగా తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల గురించి పేర్కొనటం తెలిసిందే.
తాజాగా జరిగిన సమావేశంలో ఏపీనే తెలంగాణకు పెద్ద ఎత్తున బకాయిలు పడిందని.. వాటిని తీర్చాలని కోరటం చూస్తే.. ఎవరు ఎవరికి బాకీ పడ్డారు? అన్న లెక్క ఇప్పట్లో తెగే పరిస్థితి కనిపించటం లేదంటున్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన అప్పును ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వ చేతకానితనాన్ని గుర్తు చేసేలా.. వాదనను వినిపిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణకు ఏపీ అప్పు పడిందంటూ చెప్పిన ఈ లెక్కపై ఏపీ సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.