మా 13 లక్షల మందిని కాపాడ్డానికి మా సామి వస్తాడు.. ఈ అరచేయి ఆకాశాన్ని అర్ధిస్తుంది..అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు..
జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు..
నువ్వే మా దేవుడని నమ్మే పనిలేదు. మాకు నమ్మించే అక్కర లేదు సామీ..
సామీ.. నీ దర్శనం… ఇది నిదర్శనం!
నీ నవ్వు వరం. నీ కోపం శాపం. నీ మాట శాసనం సామీ!!
మా లెక్క తప్పదు సామీ.. నువ్వు దేవుడు సామీ!!!
చల్లటి ఏసీలో విష్ణుమూర్తిలా కుషన్చైర్లో కళ్లు మూసుకుని ధ్యానయోగంలో ఉన్న జగనన్న ముందు.. ఉద్యోగ సంఘ నేతలు వినిపించే ఇలాంటి స్తోత్రాలతో జగనన్న మరింత ఆనంద పరవశుడయ్యారు. ఆయన మనసు మరింత వికసించింది. భక్త నేతలు ఆర్తితో చేసిన భజనతో జగనన్న హృదయం ద్రవించింది. చిరునవ్వుతో ప్రశాంతంగా కళ్లు విప్పి,
‘ మీ భక్తికి మెచ్చా. మీకు ఇంకో రెండేళ్లు సర్వీసు పొడిగిస్తున్నా పొండి’ అన్న వరం ఇచ్చాడు.
అంతే.. ‘సామీ నువ్వు దేవుడివి సామీ. నీ పాలనలో పనిచేయడమే మాకు మహద్భాగ్యం. మా జన్మధన్యమయింది సామీ.
దేవుడెక్కడో 300 రూపాయలు టికెట్ కొని చూసే దాంట్లో, 10 వేల స్పెషల్ టికెట్లలో లేడు సామీ. ఇక్కడే.. ఈ తాడేపల్లిలోనే మా ముందే తిరుగుతున్నాడు సామీ. నీ మహిమలు అనంతం. నీ శక్తి అమోఘం. నీ హృదయం ఎవరెస్టంత విశాలం. నీ చేతికే కాదు సామీ. నీ నోటికీ ఎముక లేదు సామీ. అసలు ఈ ధరిత్రిలో నీ అంత గొప్పోడు లేనే లేడు సామీ. ఒకవేళ ఉన్నా మేం ఒప్పుకోం సామీ. ఒప్పుకోం! నీ దర్శనభాగ్యం వల్ల.. నీదయ వల్ల.. నీవిచ్చిన వరాల వల్ల మా పుణ్యం పుచ్చిపోయింది సామీ.
అసలు మా జీవితకాలంలో మిమ్మల్ని ఇలా అతి దగ్గరగా చూసి, డైరీ కూడా ఆవిష్కరింపచేస్తామని కలలో కూడా అనుకోలేదు సామీ. మీ దర్శనభాగ్యమే మాకు పదివేలు. మీరిచ్చిన మా ఎక్స్ట్రా రెండేళ్లు సర్వీసు పూర్తయ్యే వరకూ.. పూర్తయిన తర్వాత కూడా, మీ ఘనతను మరవం సామీ! నీ దర్శనం.నిదర్శనం సామీ’ అని ఉద్యోగ సంఘ నేతలు అర్ధనిమీలిత నేత్రులై, కంటి వెంట జలపాతంలా కారుతున్న కన్నీరుతో కలగలసి చేస్తున్న ‘జగనన్న గాన లహరికి’, అక్కడున్న ఆఫీసర్లకూ ఆనందబాష్పాలు ఆగలేదు.
భజన ముగించిన సంఘనేతలు.. ‘సామీ, ఈ మధ్య కాలంలో మా నోటిదూలతో మిమ్మల్ని ఏమైనా తూలనాడితే క్షమించండి. మేమంతా మీకు బిడ్డల్లాంటివాళ్లం. బిడ్డలు తండ్రిమీద అలగరా ఏంటి సామీ’ అని ఓ భక్త నేత అన్నప్పుడు, జగనన్న చిరునవ్వు చిందించారు.
ఇంకో కోస్తా భక్తుడు లేచి.. ‘సామీ మావన్నీ ఉత్తిత్తి అరుపులు, ఊరక గాండ్రిపులే. మాకు అంత సీనులేదని మీకూ, సజ్జలన్నకూ తెలుసుకదా. అప్పటికీ సజ్జలన్న చెప్పినట్లు కంట్రోల్లోనే ఉంటున్నాం. కానీ అసలేమీ గర్జించకపోతే మేం మీతో సర్దుకుపోతున్నామని మా వాళ్లు అనుమానిస్తారని అలా బిల్డప్పులిచ్చాం సామీ. నువ్వేమీ మనసులో పెట్టుకోబాక’ అని కోస్తా భక్త నేత, ఆర్తితో లౌక్యంగా చేసిన ప్రార్ధనకూ జగన్ అంతే చిరునవ్వులు చిందించారు.
ఈలోగా ఓ భజన నేత పెట్టిన కెవ్వుకేక హాల్‌ను ప్రతిధ్వనింపచేసింది. ‘ఏంది శీనన్నా.. ఏమాయె. ఏమట్లా ఏడచ్చా ఉండావు. పానం బాగుందా’ అని జగనన్న అడగడంతో, శీనన్న అమాంతం జగనన్న కాళ్లపై సాష్టాంగపడి.. ‘పాహిమాం పాహిమాం. మీరు పెద్ద మనసుతో రెండేళ్ల సర్వీసు ఎక్స్టెన్షను ఇస్తారని తెలియక మీడియా ముందు ఏమేమో మాట్లాడా. మన్నించు మహాప్రభో. మీరిచ్చిన వరంతో నాకూ రెండేళ్లు ఎక్స్టెన్షన్ వచ్చింది మహాప్రభో’ అన్నాడు.
వెంటనే జగనన్న, శీనన్నను పైకి లేపి.. ‘అవన్నీ రాజకీయాల్లో సహజమప్పా. ఇప్పుడు నన్ను చూడు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నన్ను తిట్టినోళ్లను క్యాబినెట్లో తీసుకోలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను వ్యతిరేకించి, ఇప్పుడు ప్రోత్సహించడంలా? ఇదీ అంతే. లైట్ తీసుకో శీనన్నా.
హాయిగా ఈ రెండేళ్ల ఎక్స్ట్రా సర్వీసును ఎంజాయ్ చెయ్. తర్వాత నీకూ చంద్రశేఖరన్న మాదిరిగా పోస్టు ఇచ్చాలే’ననడంతో తన్మయుడైన శీనన్న, మరోసారి ఢామ్మన జగనన్న కాళ్లపై పడిపోయారు. ‘చాల్చాల్లే భజస సమయం అయిపోయిందిక నడవండి’ అని సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పడంతో.. జై జగన్, జై జగనన్న హై హై నాయకా అంటూ జగన్నామస్మరణతో గేట్ 1 దాటారు.
మళ్లీ అపరిచితుడులో విక్రమ్ మాదిరిగా, నేతలంతా ఎవరి పాత్రలోకి వారొచ్చేశారు. ‘ ఏందన్నా ఇంతకూ మనం అడిగినవన్నీ ఇచ్చినట్లా ఇవ్వనట్లా? నాకేమీ అర్తం కాలేదప్పా’ అని సీమ నేత సందేహం వ్యక్తం చేశాడు. ‘అందులో ఏముందయ్యా. సీఎం సారు 2,3 రోజుల్లో మన సంగతి తేల్చేస్తానని ముందే చెప్పాడు.
కానీ ఆ రెండూ కలిపి ఫిట్మెంట్ 23 ఇస్తాడని ఊహించకపోవడం మన తప్పు. సరే.. లోపల జరిగిందతా బయటకు చెప్పబాకు’ అని కోస్తా నేత బదులిచ్చాడు. ‘అది సరే.. దీని పాసుగూల. సీపీఎస్‌పై మీరంతా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడే ఇది మాకు ములాది అని చెప్పబళ్లా? ఇంకో నేత ప్రశ్నించాడు.
‘సరె సర్లె. అసలు జగన్‌సారు మనల్ని కల్సడమే ఎక్కువ. ఇంకా ఆయనకు అడ్డు చెబుతామా ఏందీ’ అని ఇంకో నేత సమర్థించాడు. ‘మరిప్పుడు ఆ మీడియావాళ్లకు ఏం చెబుతాం’ అని ఇంకో నేత సందేహం వ్యక్తం చేశాడు. ‘ఏముంది? లోపల మనకు ఇచ్చిన స్క్రిప్టును చదివి వినిపిద్దాం. రేపు గవర్నమెంటుతో మనకూ పనులుంటాయి కదా’ అని మరో సీనియర్ నేత లౌక్యంగా చెప్పిన మాటకు, అయితే ఓకే అని అంతా కోరస్ ఇచ్చారు.
అంతా బాగానే ఉంది గానీ.. ‘మరి ఆ హెచ్ఆర్ఏ శ్లాబ్, అదనపు పింఛను, గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ ఒకే జీతం, ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ సంగతి ఏంటి’ అని మతిలేని మల్లారావు అనే నేత ప్రశ్నించాడు. పక్కనే ఉన్న శీనన్న అందుకుని.. ‘చంద్రశేఖర్రెడ్డన్న చెప్పాడు గందా? ప్రభుత్వం న్యాయం చేస్తుందని. అందరికీ అదే చెబుదాం. మనకేటి పోనాదీ? ఈ రెండేళ్లు అట్నే అనుకుందాం ’ అని కారెక్కి వెళ్లిపోయారు.
సీన్ కట్ చేస్తే…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అనే సత్తెకాలపు సత్తయ్య మాత్రం.. ఈ వేతన సవరణతో ఉద్యోగులకేమీ ఉపయోగం లేదని, ఉద్యోగ నేతల ప్రవర్తన సర్కస్ బఫూన్ల మాదిరిగా
ఉందని మండిపడ్డారు. అయితే సర్కస్ బఫూన్లు వేరు.. సర్కారీ బఫూన్లు వేరని సూరన్నకు తెలుసుకుంటే మంచిదన్నది సర్కస్ బఫూన్ల ఆవేదన. సర్కస్ బఫూన్లు.. షో ముగిసేవరకూ ముఖానికి రంగులేసుకుని కష్టపడితే వచ్చేది అంతంతమాత్రమే.
కానీ, వారిలో ప్రేక్షకులను నవ్వించాలన్న కమిట్మెంట్ ఉంటుంది. కానీ సూరన్న చెప్పిన సర్కారీ బఫూన్లకు, ముఖానికి రంగులేసుకునే పని ఉండదు. గవర్నమెంట్లో ఉన్న పార్టీలను బట్టి, రంగులు ఆటోమేటిగ్గా మారుతుంటాయి. సర్కస్ బఫూన్లకు.. ఏసీ కార్లు, సీఎం-మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వరు. ప్లాట్లు, ఫ్లాట్లూ ఉండవు. మీడియా వాళ్లు లైవ్ టెలికాస్టు చేయరు.
సర్కస్ కంపెనీలో పనిచేసే ‘నలుగురితో నారాయణ’ అనుకోవడమే. కాబట్టి ఉద్యోగ నేతలను సర్కస్ బఫూన్లతో పోల్చినందుకు, సూరన్న తక్షణం క్షమాపణ చెప్పకపోతే సర్కస్ బఫూన్లు ఫీలవుతారు. ఇప్పటికే సూరన్న చేసిన కామెంటు తమను అవమానించేలా ఉందని, సర్కస్ బఫూన్లు సిగ్గుతో చితికిపోయి కుమిలిపోతున్నారట. మరి సర్కస్ బఫూన్లకూ ఆత్మాభిమానం ఉంటుంది కదా?