నందమూరి నటసింహం, మాస్ కా బాప్ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా బాలయ్య బాబు వ్యాఖ్యాతగా ఉన్న ఈ టాక్ షో ఆహా ఓటీటీకి కొత్త ఊపును ఇచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ప్రతి ఎపిసోడ్ కు అనూహ్య స్పందన వస్తోంది. ఎనిమిది ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఈ షోను బాలయ్య తనదైన డైలాగులతో హావభాాలతో మరో లెవల్ కు తీసుకువెళ్లారు.
ఈ షోలో ఇప్పటిదాకా టెలికాస్ట్ అయిన ప్రతి ఎపిసోడ్ టాప్ రేటింగ్ నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య టాక్ షో దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా నిలిచిందని ఐఎండీబీ ప్రకటించింది. ఇండియాలోని టాక్ షోలపై ఐఎండీబీ చేసిన సర్వేలో 9.7 పాయింట్లతో బాలయ్య షో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని టీవీ షోలు, వెబ్ షోలలో టాప్ 50 షోలను ఐఎండీబీ సెలెక్ట్ చేసింది. వాటిలో బాలయ్య షో 10కి 9.7 పాయింట్లతో టాప్ లేపింది.
ఈ జాబితాలో 7.8 పాయింట్లతో ‘ది కపిల్ శర్మ షో’ నిలవగా…4.9 పాయింట్లతో ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 10వ స్థానంలో నిలిచింది. సినిమాలు, టీవీ సిరీస్ లు, టాక్ షోలకు ఐఎంబీడీ సంస్థ రేటింగ్ లను నిర్ణయిస్తుంటుంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకోవడం, ప్రేక్షకులు ఆయా షోలకు, సినిమాలకు ఇచ్చిన రేటింగ్ లను పరిగణనలోకి తీసుకొని ఐఎండీబీ రేటింగ్ లను నిర్ణయిస్తుంది.