కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సినీ ఇండస్ట్రీకి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతుందని, ఇండస్ట్రీలో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు బాగా ధనవంతులయ్యేలా చంద్రబాబు సహకరించారని ప్రసన్న కుమార్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆ కామెంట్లపై చంద్రబాబు మండిపడ్డారు. సినీ పరిశ్రమపై చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ల వివాదంలోకీ టీడీపీని లాగుతున్నారని, టీడీపీకి సినీ పరిశ్రమ ఏనాడూ సహకరించింది లేదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడే జగన్…భవన నిర్మాణంపై మాట్లాడరని ఫైర్ అయ్యారు.
సొంత సిమెంట్ కంపెనీ ఉందని ఇష్టానుసారం సిమెంట్ ధరలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల కూడా భారతీ సిమెంట్ ధరలు పెంచారని ఆరోపించారు. ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ రెడ్డి పీడితులేనని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ లేకుంటే ఆ ఎన్నికల్లో గెలిచేవారమని షాకింగ్ కామెంట్లు చేశారు. చిరంజీవితోపాటు, సినిమా టికెట్ల వ్యవహారంపై చంద్రబాబు స్పందన ఇటు రాజకీయ వర్గాలతోపాటు అటు సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారింది.