నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా. నువ్వు ఏరా అంటే.. నేను అంతకుమించిన అవమానకరంగా మాట్లాడతా.. అన్న ధోరణి సినిమాల్లోనూ.. కొందరి దగ్గర చూస్తుంటాం. కానీ.. ఒక రాజకీయ నేత.. మరో సినీ రంగ ప్రముఖుడి మధ్య మాట తూలే క్రమం ఇప్పటివరకు పెద్దగా చూసి ఉండం. కానీ.. ఆ లోటును తీర్చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.
గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారటంతో పాటు.. తెలుగు వారంతా చర్చించుకుంటున్న ఏపీ సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చించేందుకు వెళ్లిన రాంగోపాల్ వర్మ.. విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకొని.. నేరుగా ఒక మీడియా చానల్ కు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
సినిమావాళ్లు బలిసిపోయారని.. టికెట్ల ధరల్ని వెయ్యి.. రూ.1500లకు పెంచేశారని.. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన తర్వాత కానీ మరే ముఖ్యమంత్రి చేయని విధంగా టికెట్ల ధరల్ని సీఎంజగన్ తగ్గించారంటూ.. ఆ క్రమంలో సినిమా ఇండస్ట్రీ తీరుపై మండిపడ్డారు. ఆయన మాటల్లో.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీ వారు ఎవరూ పట్టించుకోవటం లేదని.. హైదరాబాద్ లో కూర్చొని ఏపీ ముఖ్యమంత్రిని గుర్తించటం లేదన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల క్లిప్ చూసిన రాంగోపాల్ వర్మ.. అనూహ్యంగ రియాక్టు అయ్యారు. ఊహించని రీతిలో స్పందిస్తూ.. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి.. ఇప్పటివరకు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుడు అనని రీతిలో ఆయనపై వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీని నోటికి వచ్చినట్లు అంటే.. ఊరుకోనని.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే.. తన స్పందన ఇంతే తీవ్రంగా ఉంటుందన్నరీతిలో వర్మ వ్యాఖ్యలు ఉన్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే క్లిప్ విన్నంతనే స్పందించిన వర్మ.. ‘‘వైఎస్ జగన్మోహన్ గారు.. మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. వీడు లాంటోడు.. వీడి పేరేంటన్నారు? అంటూ చానల్ లో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని అడగ్గా.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అని బదులిచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి లాంటోడ్ని మీ పక్కన పెట్టుకొని మీకున్న పేరు ప్రఖ్యాతుల్ని పాడు చేస్తున్నారు. మీ ఫ్యాన్ గా మీకు సలహా ఇస్తున్నాను సార్. ఇలాంటి ఇడియట్లను మీతో ఉంచుకోమాకండి’’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.
సినిమా హీరోలు దోచేసుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అర్థం లేదని.. ఆ మాటకు వస్తే కనీస అవగాహన కూడా లేదన్న ఆయన.. ‘‘ఎందుకు.. ఇడియట్ అని వాడిని అన్నానంటే.. సినిమా ఇండస్ట్రీ అన్నది యాక్టర్లు వేరు.. ప్రొడ్యూసర్లు వేరు.. ఎగ్జిబిటర్లు వేరు.. డిస్ట్రిబ్యూటర్లు వేరు.
హీరోలకు ఎవరికి సినిమా ఎలా రిలీజ్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎక్కడ రిలీజ్ అవుతుంది అన్నది తెలీదు. దాని బిజినెస్ ఎలా జరుగుతుందన్నది హీరోలకు తెలీదు. దర్శకులకు తెలీదు. నిర్మాతలకు కొద్దిమేర తెలుస్తుంది. ఎవడైతే బ్లాక్ లో అమ్మే వాడితో ఈ విషయాలన్నింటిని కప్పేసి.. సినిమావోడ్ని అనటమంటే.. వాడ్ని మూర్ఖుడంటారు. సినిమా గురించి ఏ మాత్రం తెలీదంటారు. ఇలాంటోళ్ల గురించి నేను అసలు మాట్లాడను’’ అంటూ మంత్రి పేర్ని నానితో తనకు జరిగిన మీటింగ్ గురించి వివరాల్ని వెల్లడించే పనిలో పడ్డారు.
అంతేకాదు.. ఈ ఎమ్మెల్యేని ‘వీడు’ అని అన్నాను. పేర్ని నానిని ‘గారు’ అని ఎందుకు సంబోధించానంటే.. ఆయన ఎప్పుడూ నన్ను చాలా గౌరవంగా సంబోధించారు. ఆయన తన భాష, ఆయనకు ఉన్న పొజిషన్‌కి డిగ్నిటీ ఇచ్చారు. నేను కూడా ఆయనకు డిగ్నిటీగా సమాధానం ఇస్తానంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.
సదరు చానల్ లో దాదాపు గంటకు పైగా ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో మధ్యలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో ఒకింత ఘాటుగానే రియాక్టు అయ్యారు వర్మ. ఎంతైనా.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఇష్టారాజ్యంగా మాట్లాడితే.. మిగిలిన వారి మాదిరి చూస్తూ ఉండేది లేదన్నట్లుగా వర్మ వ్యాఖ్యలు ఉండమే కాదు.. మీరు రెండు అంటే.. నేను నాలుగు అంటానన్న సందేశాన్ని ఇచ్చిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.