మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కుప్పంలోని సి. బండ్లపల్లెలో అక్రమ మైనింగ్ ప్రాంతాలను సందర్శించిన చంద్రబాబు…పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఖండ సినిమాలో తరహాలో కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు. దీని వెనుక పెద్దిరెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ అక్రమ మైనింగ్ పై గ్రీన్ ట్రిబ్యునల్, న్యాయ స్దానానికి,కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అక్రమ మైనింగ్ డబ్బులను మున్సిపల్, పంచాయతీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఖర్చుపెట్టారని అన్నారు. పెద్దిరెడ్డిని మంత్రిపదవి నుంచి తొలగించాలని, జగన్ దీనిపై స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ద్రావిడ వర్శిటిలో 150 ఎకరాలలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, పోలీసులు మామూళ్ళ మత్తులో తూగుతున్నారని విమర్శించారు.
మాఫియా డాన్ గా మంత్రి పెద్దిరెడ్డి పనిచేస్తురని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కామెంట్లపై పెద్దిరెడ్డి స్పందించారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్రమ మైనింగ్ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బాబును తప్పకుండా ఓడిస్తామని, ఇది తప్పకుండా జరుగుతుందని అన్నారు.