రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనే విషయంలో సందిగ్ధతకు చంద్రబాబునాయుడు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను కుప్పం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తాజా ప్రకటనతో చంద్రబాబు నియోజకవర్గం మారుతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే అనుకోవాలి. ఇప్పటికి ఏడుసార్లు తనను గెలిపించారని మరో రెండు ఎన్నికల్లో కూడా తననే గెలిపించమని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు తాజా ప్రకటన ద్వారా రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది. మొదటిదేమో కుప్పంలోనే పోటీ చేస్తానని. రెండో విషయం ఏమో మరో రెండు ఎన్నికల్లో కూడా తాను పోటీలోనే ఉంటానని. మొదటి విషయం చంద్రబాబు చేతిలోనే ఉంది. కానీ రెండు ఎన్నికల్లో తాను పోటీ చేయడం అనే మాట మాత్రం చంద్రబాబు చేతిలో లేదు. 2024 వరకు ఓకేనే కానీ 2029 ఎన్నికల్లో పోటీ అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు చంద్రబాబు వయస్సు 75కి దగ్గరలో ఉంటుంది.
అదే 2029 ఎన్నికల్లో పోటీ చేయాలంటే చంద్రబాబు వయసు దగ్గర దగ్గర 80 ఉంటుంది. నిజానికి ఆ వయసులో పోటీ చేయటం చాలామందికి సాధ్యం కాదు. 70 ఏళ్ళ వయసులో పోటీ అంటే మన రాజకీయాల్లో చాలా మామూలే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో 70-75 ఏళ్ళ వయస్సున్న నేతలు చాలామందే కనిపిస్తారు. కానీ పెద్దగా యాక్టివ్ గా మాత్రం ఉండరు. పార్టీ బాధ్యతలను వారసులకో లేకపోతే ఇంకోవరికో అప్పగించేసి ఏదో పెద్ద దిక్కుగా మాత్రమే ఉంటారు.
కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు. పార్టీలో తానే యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. దీనికి కాలం కూడా సహకరించాలి. అందుకు ముందు 2024లో అధికారంలోకి వస్తేనే చంద్రబాబు కోరిక తీరే అవకాశం ఉంది. ఏ కారణం వల్ల అయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు కోరిక తీరే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
ఆరోగ్య పరంగా చూస్తే చంద్రబాబు చాలా హెల్తీగా ఉంటారు. ఆయన 40 ఏళ్ల నుంచే డైట్ ఫాలో అవుతున్నారు. 55 ఏళ్లపుడు తిరుమల మెట్లు ఎక్కడానికి చిరంజీవి ఎంతో అలసట ఫీలై చాలా సార్లు మధ్యలో ఆగిపోతే 68 ఏళ్ల వయసులో చంద్రబాబు మధ్యలో కేవలం 2 నిమిషాలు మాత్రం ఒకసారి ఆగి మొత్తం కొండ ఎక్కేశారు ఆ మధ్యన. ఇప్పటికే 5 గంటలు నిలబడి ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన ఓపిక ఉంది. ప్రెస్ మీట్లలో నీరు కూడా తాగకుండా 3 గంటలు అయినా మాట్లాడటం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ వృద్ధులకు భిన్నంగా చంద్రబాబు మరో పది పన్నెండు సంవత్సరాలు అయితే కచ్చితంగా యాక్టివ్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ ఏదైనా కాలమే నిర్ణయించాలు. ఇవి అంచనాలు మాత్రమే.