మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిపక్షాలు ముద్దుగా బూతుల మంత్రి అని పిలుచుకునే నాని….ప్రెస్ మీట్ పెడితే చాలు చంద్రబాబును, లోకేష్ ను, కొన్ని పత్రికలను, న్యూస్ చానెళ్లను తిట్టనిదే ముగించరు. కొన్ని పత్రికలు, చానెళ్లు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయని వాటి ఓనర్లపై నాని నిత్యం విమ్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలోనే నాని చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశమైంది.
టీవీ 5, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలను మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిషేధిస్తున్నామంటూ షాకింగ్ ప్రకటన చేశారు. ఆ మీడియా సంస్థలు ఎప్పుడూ అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నది నాని ప్రధాన ఆరోపణ. ప్రభుత్వంపై ఆ మీడియా సాయంతో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నది మరో ఆరోపణ.
ఇక, రామోజీరావు ఇంగితజ్ఞానం లేకుండా విష ప్రచారం చేస్తున్నారని, వాటిని అడ్డుపెట్టొకొని రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ నేతలు చూస్తున్నారన్నది ఇంకో ఆరోపణ.ఇక, జగన్ ను అధికార పీఠం నుంచి దించి చంద్రబాబు సీఎం అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంగమ్మ శపథం చేయడం కొసమెరుపు. ఇక, తనపై వర్మ చేసిన కామెంట్లకూ నాని స్పందించారు. చాలామందికి ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉందని, దానికి సీఎంగా జగన్ ఉన్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని, తన గురించి తెలియడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.
అయితే, నాని కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో టీడీపీ నేతలపై, చంద్రబాబు, ఆయన కుటుంబంపై అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారని, వాటిని కూడా నాని నిషేధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. గురివింద నలుపు దానికి తెలీదని, అలాగే సాక్షిలో రాసే బునుగు రాతలు నానికి తెలీవని సెటైర్లు వేస్తున్నారు.