సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో పాటు మంత్రి పేర్ని నానిపై కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వర్మ లాజికల్ గా అడిగిన ప్రశ్నలకు పేర్ని నానికూడా అంతే లాజికల్ గా సమాధానమిచ్చారు.
ఆ తర్వాత పేర్ని నాని చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందని వర్మ…మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఇక, మిగతా మంత్రులు, వైసీపీ నేతల్లాగా కాకుండా డిగ్నితో విమర్శలు చేసిన పేర్ని నానికి వర్మ ధన్యవాదాలు కూడా తెలిపారు.
అయితే, అంతకుముందు పక్క రాష్ట్రంలో ఉండి విమర్శలు చేసే వర్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మరో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వర్మ తనదైన రీతిలోనే స్పందించారు. పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్రా గురించి వర్మ ఏమైనా మాట్లాడతారని ఎద్దేవా చేసిన కొడాలి నానికి వర్మ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు తనను అడుగుతున్నారని వర్మ ట్వీట్ చేశారు.
అయితే, వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో తనకు తెలియదని, తనకు తెలిసింది న్యాచురల్ స్టార్ నాని ఒక్కడేనని వర్మ చురకలంటించారు. ఈ క్రమంలోనే కొడాలి నాని కామెంట్లపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో ఉండే వర్మ కామెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పుడు పేర్ని నాని ఎందుకు స్పందించారని వారు ప్రశ్నిస్తున్నారు.
హీరో నాని కూడా పక్క రాష్ట్రంలోనే ఉంటున్నారని, ఆయనపై విరుచుకుపడ్డ కొడాలి నాని…వర్మను మాత్రం ఎందుకు విమర్శించడం లేదని నిలదీస్తున్నారు. వర్మ అడిగిన ప్రశ్నల్లో లాజిక్ ఉందని, కాబట్టే కొడాలి నాని సమాధానమివ్వలేకపోతున్నారని అంటున్నారు. మరి, తాజాగా వర్మ చేసిన కామెంట్లపై కొడాలి నాని రియాక్ట్ అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.