ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ విరోధం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. 2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి ఏపీలో అధికారం కోసం ఈ రెండు పార్టీలు కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ తన పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించిన జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.
ఇక 2019 ఎన్నికల్లో జగన్ ఘన విజయంతో టీడీపీ పత్తా లేకుండా పోయింది. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీపై వైసీపీదే ఆధిపత్యం. బాబు నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జగన్‌కు ఎలాంటి పోటీ లేకపోయింది. కానీ ఇప్పుడు అదే టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తన హయాంలో చేసిన ఓ చట్టం ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అన్నతో షర్మిల ఆస్తి విభేదాలు
తండ్రి హఠాన్మరణంతో అన్న పార్టీ పెట్టాడు. కుటుంబం మొత్తం జగన్ కి అండగా నిలిచారు. అన్న జైలుకు వెళ్తే అతనికోసం షర్మిల పార్టీ భారం మోసింది. పాదయాత్ర చేసింది. ఆ సమయంలో షర్మిల ఎంట్రీ ఇవ్వకపోతే పార్టీ నిలబడేది కాదు. గత ఎన్నికల్లోనూ బై బై బాబు నినాదాన్ని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లింది కూడా షర్మిలయే. ఒక ముక్కలో చెప్పాలంటే అన్నకు అధికారం రావడం వెనుక చెల్లి కృషి వంద శాతం ఉంది.
కానీ అధికారం రాగానే జగన్ చెల్లికి పదవి ఇవ్వలేదు. ఇపుడేమో ఆస్తి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. అంత వివాదం అయినా ఏపీలో పార్టీ పెట్టి అన్నను ఇబ్బంది పెట్టకుండా తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు కనీసం ఆస్తి కూడా ఇవ్వకపోవడంతో ఆమెకు మండిపోయింది. అందుకే ఏపీలోనే పార్టీ పెట్టాలని ఆమె డిసైడ్ అయ్యిందని చెబుతున్నారు. వివేకా కేసులో వాస్తవాలు బయటపెట్టేందుకు కూడా ఆమె వెనుకాడటం లేదట.
ఆ చట్టంతో..
తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణలో దాని బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మరోవైపు తనకు అన్యాయం చేసిన అన్న జగన్‌పైనా ఆమె పోరాటం చేస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడామె పోరాటానికి అండగా నిలుస్తోంది ఎవరో తెలుసా… స్వర్గీయ ఎన్టీఆర్. ఎన్టీఆర్ హయాంలో తెచ్చిన ఆడవాళ్లకు ఆస్తి హక్కు చట్టం షర్మిలకు ఆయుధంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమాన వాటా..
1956లో మహిళా ఆస్తి హక్కు చట్టంలో అప్పటి భారత ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. చనిపోయిన భర్త ఆస్తిని భార్య అనుభవించడమే కాకుండా దానిని అమ్మడానికి ఈ చట్టం ద్వారా వీలు కల్పించారు. అయితే ఎన్టీఆర్ సీఎంగా అయిన తర్వాత ఈ చట్టానికి సవరణ చేస్తూ 1986 మహిళల ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. తండ్రి ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు సమాన హక్కు కల్పించారు. 1985 సెప్టెంబర్ 5న రూపొందించిన ఈ చట్టం 1986 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం ద్వారా మహిళల జీవితాల్లో ఎన్టీఆర్ వెలుగులు నింపారని అంతా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ తెచ్చిన ఈ చట్టాన్ని మెచ్చుకున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కూడా వారి రాష్ట్రాల్లో దీన్ని అమల్లోకి తెచ్చాయి. 2005లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసి దేశమంతా వర్తింపజేసింది. ఇటీవల సుప్రీం కోర్టు కూడా తండ్రి ఆస్తిలో కూతుళ్లకూ సమాన వాటా ఉంటుందని స్పష్టం చేసింది.
ఇప్పుడదే షర్మిల ఆయుధం..
ఇప్పుడిదే చట్టాన్ని ఆయుధంగా మలుచుకున్న అన్న జగన్‌పై షర్మిల పోరాడుతోంది. జగన్ అధికారంలోకి రావడంలో తన పాదయాత్రతో సాయం చేసిన షర్మిల.. ఆ తర్వాత తనపై అన్న వివక్ష చూపడంతో తట్టుకోలేకపోయిందని సమాచారం. అందుకే తెలంగాణలో వేరు కుంపటి పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి నుంచి ఈ అన్నాచెల్లెలి మధ్య దూరం పెరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు రావాల్సిన వాటిపై ఈ ఆస్తిహక్కు చట్టం ద్వారా షర్మిల పోరాడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒకప్పుడు ఎన్టీఆర్ తెచ్చిన చట్టం.. ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకున్నట్లయిందనేది విశ్లేషకుల మాట.