ఈ టెక్ జమానాలో వైట్ కాలర్ మోసాలు పెరిగిపోయాయి. మాయమాటలు చెప్పి అమాయకుల నుంచ ఓటీపీ తెలుసుకొని వేల రూపాయలు కొల్లగొట్టడం మొదలు….ఆన్ లైన లాటరీ పేరుతో చదువుకున్న వారికి సైతం లక్షల్లో కుచ్చుటోపీ పెడుతున్నారీ నయా మోసగాళ్లు. సామాన్యులనే కాదు ఏకంగా సైబర్ క్ర్రైమ్ పోలీసులను కూడా బురిడీ కొట్టించే రేంజ్ లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓఎల్ ఎక్స్ లో నమ్మకమైన అమ్మకమంటూ లేని వస్తువులకూ భలే మంచి చౌక బేరం పెట్టి అందినకాడికి డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు మహా మాయగాళ్లు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్ ను ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. రూ. 7.5 కోట్ల రూపాయలకు ప్రధాని మోడీ ఆఫీస్ బిల్డింగ్ అమ్మకానికి ఉందంటూ ఈ కేటుగాళ్లు పెట్టిన పోస్ట్ సంచలనం రేపింది.
ఓఎల్ఎక్స్ ఆన్ లైన్ లో లొసుగుల ద్వారా కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నేరుగా మీ ఎకౌంట్ లోకి డబ్బులు పడతాయంటూ వినియోగదారుల ఖాతా నుంచే డబ్బు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎకౌంట్ లో డబ్బులు పడిన వెంటనే ఇంటికొచ్చి వస్తువు తీసుకెళ్తామని చెప్పడంతో నమ్మి మోసపోతున్నారు వినియోగదారులు. డబ్బులు పోయాక లబోదిబోమంటూ సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఓఎల్ఎక్స్ పేరిట వస్తున్న ప్రకటనల్లో 90 శాతం తప్పుడువని పోలీసులు హెచ్చరిస్తున్నా…చాలామంది మోసగాళ్ల వలలో పడుతున్నారు. ఈ క్రమంలోనే అమాయకులను బురిడీ కొట్టించేందుకు వారణాసిలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న మోడీ పార్లమెంటరీ కార్యాలయాన్ని కొందరు కేటుగాళ్లు బేరం పెట్టారు. ఆ ఆఫీసును విల్లాగా పేర్కొంటూ వివరాలు, ఫోటోలతో సహా సైట్ లో పెట్టేశారు. 6500 చదరపు అడుగుల విస్తీర్ణం, 4 గదులు, 4 బాత్రూమ్లతో పాటుగా కార్ పార్కింగ్ ఉందంటూ వివరాలను OLX వెబ్ సైట్ లో ఉంచారు. ఆ కేటుగాళ్ల గుట్టురట్టవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ పోస్టును వెంటనే తొలిగించిన పోలీసులు ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.