జగన్ హయాంలో ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా దేవుడి, దేవతల విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడులు పెరిగాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన సర్కార్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దాడులు పెరిగిపోయాయని, ఇప్పటి దాకా విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడానికి ప్రయత్నం జరగడం కలకలం రేపింది.
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కోటేశ్వరరావు అనే వ్యక్తి ధ్వసం చేయడానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ధీంతో, కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. ఈ విషయం తెలియగానే టీడీపీ నేతలు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.
ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో, జూలకంటి బ్రహ్మారెడ్డి సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు, ఈ ఘటనను ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయడం అంటే మన తెలుగు జాతిని అవమానించినట్లేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగు జాతి ఊరుకోదని రామకృష్ణ హెచ్చరించారు. కొందరు వైసీపీ నేతల డైరెక్షన్ లోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ ఈ విషయాన్ని తేలికగా తీసుకోరని హెచ్చరించారు.