సంచలనాలకు పెట్టింది పేరుగా చెప్పే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. తన కాలమ్ ‘కొత్త పలుకు’ పేరుతో విశ్లేషణ రూపంలో కొన్ని సార్లు సంచలనాలు బయటపెడుతున్నారు. కొందరు ఆ కాలమ్ ను ఆంధ్రజ్యోతిలోని ఎవరో ఒక సీనియర్ జర్నలిస్టు చేత రాయిస్తూ ఉంటారని భావిస్తారు. కానీ.. ప్రతి శనివారం ఉదయం ఆర్కేనే స్వయంగా.. ఈ కాలమ్ ను రాస్తారు.
ఈ కాలమ్ రాసే సమయం.. రాసే ప్రదేశం చాలా తక్కువ మందికే తెలుసు. ఆ సమయంలో ఆయన ఫోన్ కు అందుబాటులో ఉండరని చెబుతారు. ఆ మాటకు వస్తే.. ఆ టైంలో ఏం జరిగినా.. ఆయన పట్టించుకోకుండా రాత మీదనే పూర్తిగా ఫోకస్ చేస్తారని చెబుతారు. ఊపిరి సలపని పనుల ఒత్తిడిలో ఉన్నా.. మానసికంగా.. శారీరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ..ఆయన ఈ కాలమ్ రాయటానికి అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తారని చెబుతారు. ఈ కాలమ్ రాయకపోతే.. ఏదో వెలితిగా ఫీల్ అవుతారని.. అందుకే.. ఎన్ని సమస్యలు ఉన్నా కాలమ్ రాసే విషయంలో మాత్రం ఆయన అస్సలు తగ్గరని చెబుతారు.
ఒక విధంగా చెప్పాలంటే.. తనలోని జర్నలిస్టును బయటకు తీసుకొచ్చే ఈ కాలమ్ లోనే.. ఆయన ఒత్తిడి నుంచి బయట పడుతుంటారని చెబుతారు. ఆర్కే గురించి బాగా తెలిసిన ఆయన సన్నిహితులు.. ఆయన మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. ఆయనలో ఉదయం వేళలో వ్యాపారవేత్త.. రాత్రి సమయానికి జర్నలిస్టు నిద్ర లేస్తాడని చెబుతారు.
కానీ.. వారాంతంలో తాను రాసే ‘కొత్త పలుకు’ వేళలో మాత్రం అసలు సిసలు జర్నలిస్ట్ బయటకు వస్తాడని చెబుతారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తాడని ఆయనపై ప్రచారం జరుగుతుంటుంది… కానీ తన కాలమ్ లో బాబును తప్పు పట్టాల్సి వస్తే.. నిర్మోహమాటంగా తప్పు పట్టటం కనిపిస్తుంది.
వాస్తవానికి.. సాక్షిలో జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట.. నమస్తే తెలంగాణలో కేసీఆర్ .. కేటీఆర్ కు ఇబ్బంది కలిగించే ఒక్క పదం రాదు. కానీ.. ఆంధ్రజ్యోతిలో మాత్రం చంద్రబాబు తీరును తప్పుపడుతూ వార్తల సంగతి తర్వాత.. ఆయన తీరును వేలెత్తి చూపేలా ఆర్కే రాయటాన్ని బాబును అమితంగా అభిమానించే వారు సైతం జీర్ణించుకోలేరు. అలా అని ఆర్కే రాతను ఎవరూ ప్రభావితం చేయలేరని చెబుతారు. వాస్తవానికి ఆయన రాసిన కాపీని.. ఆ తర్వాత క్రాస్ చెక్ చేసేందుకు సీనియర్ ఉద్యోగులు ఒకరిద్దరికి ఆర్కే పంపుతారు.
వారు నిశితంగా పరిశీలించి.. అందులోని అభ్యంతరకర అంశాల్నిఆయనతో చర్చిస్తారని చెబుతారు. ఆ సమయంలో.. ఏం ఫర్లేదన్న మాట విని.. ఆయన ధైర్యానికి వారు సైతం అచ్చెరువు చెందుతారని చెబుతారు. సార్.. ఈ అంశాన్ని తీసేద్దాం.. ఇష్యూ అవుతుందేమో? అని చెబితే.. మీరేం జర్నలిస్టులు అయ్యా? మనం రాసింది నిజం కదా? ఆ మాత్రం ధైర్యంగా చెప్పలేకపోతే ఎలా? అనటమే కాదు.. ఏం ఫర్లేదు.. ఏమైనా జరిగితే ఫేస్ చేస్తానని చెప్పేస్తారట.
చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం.. సీనియర్లు చెప్పిన మాటకు ఓకే చెప్పి.. కొన్నింటిని డిలీట్ చేస్తారని చెబుతారు. తాను రాసిన దానిని డిలీట్ చేసే విషయంలో ఆయన పెద్దగా ఇష్టపడరని చెబుతారు. సాధారణంగా ఇలాంటి అలవాటు ప్రతి జర్నలిస్టులోనూ ఉంటుంది. కానీ..రిస్కు అని తెలిసి కూడా ఏం ఫర్లేదు.. అలానే వాడేద్దామనే ధైర్యం మాత్రం ఆర్కే సొంతమని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు చెబుతుంటారు.