మందుబాబులు మద్యం తాగేందుకు ఏదో ఒక సందర్భం వెతుక్కుంటుంటారు. శుభకార్యం..అశుభకార్యం…ఇలా కాదేది సిట్టింగ్ కు అనర్హం అనడం వారికి ఆనవాయితీ. ఇక, మందుబాబులందరకీ …సంతోషం..దు:ఖం ఒకేసారి వచ్చే కార్యక్రమం డిసెంబరు 31న జరుగుతుంది. పాత సంవత్సరం వెళ్లిపోతుందన్న బాధలో…కొత్త సంవత్సరం వస్తుందన్న ఆనందంలో….హోల్ సేల్ గా తాగితూగడం మందుబాబులకు అలవాటే.
మందుబాబులకున్న ఈ అలవాటే ప్రభుత్వాలకు వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ప్రతి ఏటా డిసెంబరు 31నాడు మద్యం అమ్మకాలు జోరుగా సాగి ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెడుతుంటాయి. ఈ ఏడాది కూడా తెలంగాణలో డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్క రోజే తెలంగాణలో రూ.172 కోట్ల రూపాయల లిక్కర్ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.
డిసెంబరు 31న తెలంగాణలో 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు సేల్ అయ్యాయి. మొత్తం రూ.172 కోట్ల బేరం జరిగింది. ఏపీలో 1.36 లక్షల కేసుల లిక్కర్, 53 వేల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మొత్తం రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఏపీలో ప్రీమియం బ్రాండ్లు కూడా అమ్మకానికి ఉంచడంతో మందుబాబులు వైన్ షాపులు, బార్ల ముందు బారులు తీరారు.
ఇక, గత 5 రోజుల్లోనే తెలంగాణలో దాదాపు రూ.902 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయట. ఒక్క డిసెంబరు నెలలో గత రికార్డులను చెరిపేస్తూ రూ.3,435 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. 2020 డిసెంబరులో కేవలం రూ.2764 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇక, ఈ ఏడాది మొత్తం 3,68,68,975 కేసుల లిక్కర్, 3,25,82,859 కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్ శాఖ లెక్క తేల్చింది.