తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం కట్టబెడతాయనే నమ్మకంతో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా సంక్షేమ పథకాల ఫలితాలను మాత్రం ఠంచనుగా అందిస్తున్నారు. కానీ విజయంపై జగన్‌కు ఉన్న నమ్మకం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అసలు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో అనే భయంతో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
ఏపీలో గత రెండు ఎన్నికల్లోనూ జగన్ పేరు చూసే వైసీపీ నాయకులను ప్రజలు గెలిపించారు. జగన్ పాదయాత్ర, ప్రచారం కారణంగా గత ఎన్నికల్లో పార్టీకి అధికారం దక్కింది. కానీ ఆ ఎన్నికల్లో గెలిచిన వాళ్లందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది అనుమానమే. దీంతో లోలోపల భయంతో ఉన్నవాళ్లు స్వయంగా ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలెట్టారు.
అందులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరనే టాక్ నడుస్తోంది. నేను- నా కార్యకర్త అనే కార్యక్రమంతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత దానికి జగన్ అనే పేరు జతచేశారు. స్థానికంగా బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
మరోవైపు నగరిలో రోజాది అదే పరిస్థితి. జగన్ దృష్టిలో ఆమెకు మంచి పేరుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ తన నియోజకవర్గంలో సొంత పార్టీలోని వ్యతిరేకుల నుంచి ఆమెకు అసమ్మతి సెగ తాకుతోంది. రోజాకు వ్యతిరేకంగా నగరిలో ఓ వర్గం పని చేస్తోంది.
ఇటీవల జగన్ జన్మదిన వేడుకలను ఆ అసమ్మతి వర్గం వేరుగా నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే తాము పార్టీ కోసం పనిచేయమని తెగేసే చెప్పేందుకు రోజా వ్యతిరేక వర్గం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఆమె మీతో మీ ఎమ్మెల్యే అంటూ తిరుగుతున్నారు.
వీళ్లే అని కాదు ఇలా టికెట్ దక్కుతుందో లేదో అని లోలోపల భయం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు. వాళ్లు ప్రజల్లో ఆదరణ కోసం తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోయినా రెబల్‌గా పోటీ చేసి గెలిచి తిరిగి పార్టీలో చేరాలనేది వాళ్ల ఆలోచన అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.