సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటంటూ నిలదీసిన ఆర్జీవి…సినిమా తీసేవాడికే ఆ సినిమా టికెట్ ధరను నిర్ణయించే అధికారం ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. సినిమా టికెట్స్‌పై ప్రభుత్వ పెత్తనమేంటని ప్రశ్నించిన ఆర్జీవి…ఉప్మా, సరుకుల రేట్లు కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందేమోఅంటూ సెటైర్లు వేశారు.
ఆ కామెంట్లు సద్దుమణగక ముందే మరోసారి వర్మ తన మార్క్ కామెంట్లతో వార్తల్లో నిలిచారు. ఏపీ ప్రభుత్వాన్ని, కోవిడ్ ను ఏమీ చేయలేమంటూ వర్మ తాజాగా చేసిన షాకింగ్ కామెంట్లు వైరల్ గా మారాయి. కోవిడ్ ను భరిస్తున్నట్లే, ఏపీ ప్రభుత్వాన్ని కూడా భరిస్తూనే పోవాలని, చేసేదేమీ లేదని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాహుబలి సినిమాకు ప్రొడ్యూసర్ తో ఖర్చు పెట్టించడంలో రాజమౌళి తెలుగు సినిమా కెపాసిటీని రెండు, మూడింతలు పెంచి ధైర్యం చేశారని అన్నారు.. అది ప్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడని, రాజమౌళి బ్రాండ్ తగ్గుతుందని, అది సక్సెస్ కావడం వలన ఈరోజు తెలుగు సినిమా గురించి యావత్ ప్రపంచం మాట్లాడుతుందని అన్నారు. కేజీఎఫ్, పుష్ప వంటి భారీ బడ్జెట్ సినిమాల వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో రెవెన్యూ పెరుతుందన్నారు.
అందుకే, రాజమౌళి వంటి టాలెంటెడ్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం టాక్స్ బెనిఫిట్ ఇవ్వాలని, టికెట్స్ రేట్స్ తగ్గించడం పక్కనపెట్టి రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలని అన్నారు ఆర్జీవి. తెలుగు రాష్ట్రాలకు రాజమౌళి చేసిన సేవను డబ్బుతో కొనలేమని.. ఆ ఘనత ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు వర్మ. మరి, హీరో నాని, సిద్ధార్థ్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రులు…వర్మ జోలికి వస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.