పోపుల పెట్టె తెలుసు మనకి. ఏపీలో కాపుల పెట్టె అనేది ఒకటి ఉంది తెలుసా ? రాజకీయం అవసరం అయినప్పుడు, కులం కార్డు వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ పెట్టె తాళం తీస్తారు. కాపుల ఇష్యూల్ని టిష్యూల్లా వాడి వదిలేస్తారు. రంగా హత్య అలాంటిదే. రిజర్వేషన్ల ఉద్యమం అదే. కాపుల పేరుతో కొత్తగా పెడతామంటున్న పార్టీ కూడా అందుకే. ఇప్పటి వరకూ కాపు కులాన్ని డిస్ ప్లే పెట్టి, రాజకీయంగా ముద్రగడ లాంటి వాళ్లు బాగుపడితే ఇప్పుడు వైసీపీకి లాభం చేసి కాపుల్ని వాడుకొని – పవన్ కల్యాణ్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుల క్రిమినల్ ప్లాన్ రెడీ.
ఎవరు ? ఎందుకు ?
వైఎస్ ఇమేజ్ ను ఓవర్ డ్రాఫ్ట్ లా వాడి రాజకీయంగా దివాళా తీసి రాష్ట్రాన్ని నిలువునా ముంచింది జగన్ పార్టీ. ఒక్క ఛాన్స్ ఏపీని పాతాళానికి తొక్కేసింది. సగం కాలం పూర్తి కాక ముందే జగన్ అసమర్థ పాలన మీద జనం భగ్గుమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేనేలేదు. 2019 ఎన్నికల్లో ప్రభంజనం అని చెప్పుకున్నా వైసీపీకి విపక్షం కన్నా ఎక్కువ వచ్చింది కేవలం 3 శాతం ఓట్లు. పవన్ ఒంటరిగా పోటీ చేయడం, బీజేపీకి ఉన్న అరకొర ఓట్లు కూడా వైసీపీకి బదిలీ కావడం కలిసొచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితి లేదు. పైపెచ్చు జనంలో ఆగ్రహం భగ్గుమంటోంది. ఇలాంటి సమయంలో రాజకీయంగా గందరగోళం సృష్టించి కులం పేరుతో చిచ్చు రేపాలన్నది వ్యూహం. వైఎస్ రోజుల నుంచి కాపుల వ్యవహారాన్నే వాడటం అలవాటు. రంగా హత్యపై రాజకీయం వైఎస్ కి కలిసొచ్చింది. 2009లో చిరంజీవి పార్టీ బరిలో ఉన్నందువల్లే వైఎస్ రెండో విడత బొటాబొటీ మెజారిటీతో బయట పడగలిగారు. లేదంటే కాంగ్రెస్ ఓడిపోయేదే. అందుకే మళ్లీ అలాంటి ఎత్తుగడతో కాపుల పేరుతో రాజకీయం నడిపేందుకు, వ్యతిరేక ఓటు చీల్చేందుకు జగన్ అండ్ కో పొలిటికల్ క్విడ్ ప్రో కో రెడీ చేశారు.
ఓడిన తర్వాత కూడా రాజకీయాల్లో నిలబడి పోరాటం చేస్తా అంటున్నాడు అంటే పవన్ కల్యాణ్ నిలదొక్కుకున్నట్టే లెక్క. వైసీపీ మీద పీకల దాకా ప్రజావ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో పవన్ పార్టీ ఏపీలో అత్యంత కీలకంగా అవతరించడం ఖాయం. 2019 ఎన్నికల్లో నెల్లూరు లాంటి కీలక జిల్లాల్లో 11 శాతం పైగా ఓట్లు జనసేన సాధించడం చూస్తే సామాజికంగా, వ్యూహాత్మకంగా, రాజకీయంగా పవన్ ఎంత కీలకమో అర్థం అయిపోతుంది. అందుకే జన సేన వెన్ను విరిచేందుకు, కాపుల పేరుతో ఓట్ల చీలిక తెచ్చేందుకు కుట్ర సిద్ధం అయ్యింది.
కాపు పార్టీ కోసం సమాలోచన. గంట, కన్నా, తోట తదితరులు
పవన్ ఎప్పుడూ కుల ప్రసంగాలు చేయడు. కాపుల పేరుతో ఓట్లు అడగడు. పైగా కాపులు బీసీలూ కలిసి పోరాడితే సత్తా ఏంటో చాటగలం అని కలివిడి సిద్ధాంతం చెబుతాడు. దీర్ఘకాలం రాజకీయాలు చేయాలంటే అందరినీ కలుపుకొని పోవాలంటే ఇలాంటివి కంపల్సరీ. బోయల కోసం అండగా ఉంటా అనడం, గిరిజన బాలిక కోసం కర్నూలు లాంటి చోట్ల దీక్షలకు దిగడం అన్నీ అందుకే. ఇలాంటి పవన్ ను కులంతో కొట్టాలనేది వైసీపీ కుట్ర. కాపులారా ఏకం కండి అంటూ ఓ కులనినాదం ఇచ్చి – ముద్రగడ లాంటి స్వార్థపరుల్ని ముందుపెట్టి – గంటా, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ లాంటి అవకాశ వాదుల్ని ఒక్కచోటకు చేర్చే ప్రణాళిక సిద్ధం అయ్యింది. వాళ్ల ప్రచారం కోసం ఓ టీవీ ఛానెల్ కూడా వస్తోంది. కాపులను ఆకర్షించడం, జగన్ వ్యతిరేక ఓటు చీల్చడం, పవన్ కల్యాణ్ ప్రభావాన్ని తగ్గించడం, తద్వారా విపక్ష పార్టీల విజయావకాశాల్ని అడ్డుకోవాలన్నది క్రిమినల్ గేమ్ ప్లాన్. వంగవీటి రాధాను నాని లాంటి మంత్రులు కలిసింది ఇందుకే. వైసీపీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న గంటాను ఏడాదిగా వెయిటింగ్ లో పెట్టింది కూడా దీని కోసమే. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆదర్శాలు మాట్లాడ్డానికి బ్రేక్ ఇచ్చింది కూడా ఈ ప్లానింగ్ లో భాగమే. అవకాశ వాద రాజకీయ నాయకుల్ని, కులం పేరుతో సొమ్ము చేసుకునే వ్యాపారుల్ని, పవన్ కోసం అంటూ టీవీ ఛానెల్ నడుపుతున్న ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ అధినేతనీ కలిపి అతుకుల బొంత కుట్టడం ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చింది. ఇక రేపో మాపో కాపుల గంట మోగుతుంది.
ఎవరెవరు ?
ముద్రగడ –
ముద్రగడది ముందు నుంచి కులం ఎత్తుగడ. కులాన్ని వాడుకోవడం, ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో లబ్దిదారుగా ఉండటం ఆయన చరిత్ర. సైకిల్ యాత్రలు చేసినా, రాజకీయంగా కవ్వింపు ప్రకటనలు, కంచాల చప్పళ్లు చేసినా ఆయన లెక్కే వేరు. కాపు రిజర్వేషన్లను తుంగలో తొక్కినా, కార్పొరేషన్ ను తుంచి పక్కన పడేసినా జగన్ మీద ముద్రగడ ఎందుకు పోరాటం చేయడం లేదన్నది అతి పెద్ద ప్రశ్న. రెండున్నర సంవత్సరాలు అస్త్ర సన్యాయం చేసి, వృద్ధనారీ పతివ్రత అన్నట్టు ఉండిపోయిన ముద్రగడ ఇప్పుడు మరోసారి జగన్ సేవ కోసం నిద్రలేచేచారు. కొత్తగా వైసీపీ పుట్టిస్తున్న పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పవన్ కల్యాణ్ పై కత్తి కట్టి, కాపుల నోట్లో మట్టి కొట్టేందుకు ఆయన మరోసారి సిద్ధం. ఈసారి కూడా చేసేది దొంగ యుద్ధమే.
గంటా –
అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే సంచార రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ లో టిక్కెట్ రాకపోతే చంద్రబాబు పార్టీలోకి. టీడీపీ నుంచి ప్రజారాజ్యం. అటు తర్వాత, పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే వరకూ చిరంజీవిపై ఒత్తిడిచేసి తన వాటాగా మంత్రి పదవి పొందిన నాయకుడు. కాంగ్రెస్ ఖతం అయ్యాక, టీడీపీలో చేరి మళ్లీ అదే కాపుకోటాలో మంత్రిగా వెలగబెట్టి, 2019లో గెలిచాక వైసీపీకి దాదాపు అనుబంధ సభ్యుడుగా ఉంటూ విశాఖలో ఆస్తులు కాపాడుకుంటున్న నేత. ఇప్పుడు అదే వైసీపీ కోసం కాపుల్ని ఏకం చేస్తానంటూ పులిహోర కలుపుతున్న గంటా. 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీల్లో ఉన్న గంటా కాపుల కోసం చేసిందేమిటి ? కాపుల్ని పైకి తెచ్చేందుకు చేసిన పోరాటం ఏంటో ఆలోచిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తాను పైకి రావడానికి కాపులు కేవలం నిచ్చెన మెట్లు.
కన్నా లక్ష్మీ నారాయణ-
వైఎస్ వీర విధేయుడు. గత ఎన్నికల్లో వైసీపీలో చేరబోయి ఆఖరి నిమిషంలో అదృష్ట వశాత్తూ ఆగిన నాయకుడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పగ్గాలు ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ ఆకర్షణలో పడి కాపుల పేరుతో రాజకీయ ఎత్తుగడలు వేసేందుకు సిద్ధమవుతున్న కన్నా. ఇప్పటికీ బీజేపీ మీటింగుల్లో కనిపిస్తున్న కన్నా క్లియర్ డెసిషన్ తీసుకునేందుకు దగ్గర్లో ఉన్నట్టు లెక్క.
మాజీ జేడీ లక్ష్మీ నారాయణ –
ఎవరి పని వాళ్లు చేస్తే జీతం వస్తుంది. ఈ లక్ష్మీ నారాయణకి మాత్రం జీతంతో పాటు ప్రచారం కూడా ఊహించనంత ఎక్కువగా వచ్చింది. జగన్ దోపిడీ కేసుల దర్యాప్తు ఈయన కొన్నాళ్లు చూశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఉంది కాబట్టి తన పని తాను చేసుకెళ్లే స్వేచ్ఛ దొరికింది. అదనంగా ప్రచారం చిక్కింది. విశాల భావాలు, ఆరెస్సెస్ సిద్ధాంతాలు, రైతుల పోరాటాలు అంటూ సీజన్ వారీగా ఇంటర్వ్యూలు ఇచ్చే లక్ష్మీ నారాయణ ఆఖరికి కుల చౌరస్తాలో ఆగారు. కులం కార్డు వాడి ఏదోరకంగా రాజకీయంగా నిలదొక్కుకోవాలనేది ఆయన ఐడియా. జగన్ పార్టీ కూడా నన్ను పిలిచింది అని చెప్పుకునే ఈ మాజీ జేడీ ఇప్పుడు రాజకీయంగా ఏదోరకంగా పబ్లిసిటీలో ఉండాలి అంటే కులం తప్ప మరో దిక్కు లేదు అని దిగజారిపోవడం ఊహించని విషాదం. రాష్ట్రం అధోగతి పాలవుతుంటే ఆదర్శాలు మాట్లాడే ఇలాంటి వాళ్లు కూడా కులం కుట్రలు చేస్తే ఏపీకి ఇక దేవుడే దిక్కు.
కాపుల పేరుతో దొంగ యుద్ధం చేసేందుకు అవకాశ వాద ముఠా సిద్ధం అయ్యింది. యుద్ధం చేస్తామంటోంది. ఏపీ దిక్కూ దివాణం లేక అప్పుల ఊబిలో మునిగిపోతున్న సమయం. జగన్ నీచ రాజకీయంతో ఏపీ భవిష్యత్ క్వశ్చన్ మార్క్ అయిపోయిన టైమ్. పవన్ కల్యాణ్ రాజకీయంగా తొలి విజయ ముద్ర వేసే ఎన్నికలు. సరిగ్గా ఇలాంటి సమయంలో కాపుల పేరుతో వస్తున్న గుంటనక్కల గుంపులతో జాగ్రత్త. కాపులంటే ఏపీకి కాపలాదారులు. రాష్ట్రానికి రక్షకులు. జాతి జాతి అంటూ కులాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకునే ముద్రగడ లాంటి వాళ్ల కుల ఎత్తుగడల్ని, వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన సమయం ఇది.
బహుపరాక్.