ఏపీలో సినిమా థియేటర్ల టికెట్ వ్యవహారంపై వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా…త్వరలోనే ఆ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే కొన్ని థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా థియేటర్లు మూసివేశాయి. ఇక, నిబంధనలు పాటించడం లేదంటూ మరి కొన్ని థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి మూయించారు.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. మంత్రి నానితో వారు తమ సమస్యల గురించి చర్చించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలు ఉల్లంఘించిన సినిమా థియేటర్లకు ఏపీ సర్కార్ ఊరటనిచ్చింది. ఇటీవల అధికారులు సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినించింది.
ఈ ప్రకారం ఆయా థియేటర్ల యజమానులు జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోని అనుమతి తీసుకోవాలని పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు నెల లోపు సరిదిద్దుకోవాలని నాని చెప్పారు. థియేటర్లలో నెల రోజుల్లో నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని నాని సూచించారు. ఆ థియేటర్ల విషయంలో సడలింపులపై జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని పేర్ని నాని తెలిపారు.