రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం ముదిరిన విషయం తెలిసిందే. సినిమా టికెట్లను ప్రాంతాల వారీగా విభజించి తగ్గించడంతో ధియేటర్ యజమానులు చాలా చోట్ల హాళ్లను మూసివేశారు. అదేసమయంలో ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ఇంత తక్కువ ధరలకు టికెట్లు నిర్ణయితే.. తమ కు తీవ్ర నష్టాలు వస్తాయని.. కనీసం కరెంటు బిల్లులు కట్టుకునే స్థాయిలో కూడా కలెక్షన్లు ఉండవని వారు ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి కొందరు నటులు ఈ విషయంపై స్పందించారు. శ్యామ్ సింగరాయ్ హీరో.. నాని, రిక్షావోడు.. ఆర్. నారాయణమూర్తి(వైసీపీ సానుకూలం), బొమ్మరిల్లు ఫేమ్.. నటుడు సిద్ధార్థలు హాట్ కామెంట్లే చేశారు.
నాని కామెంట్లు ఇవీ..
‘శ్యామ్ సింగరాయ్‘ మీడియా సమావేశంలో నటుడు నాని ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై అసహనం వ్యక్తం చేశారు. ‘రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిద్ధార్థ వ్యాఖ్యలు ..
దీనికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు మాత్రమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే.. మంత్రులకు పరోక్షంగా చురకలు అంటించారు నటుడు సిద్ధార్థ. టికెట్ల ధరలు తగ్గించడంపై సిద్ధార్థ్ సెటైర్లు వేశాడు.
‘‘సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్ అందిస్తున్నామని మంత్రులు అంటున్నారు. మరి మేం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంతమంది విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు కాజేస్తున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్ ఇవ్వండి’’ అంటూ ట్వీట్ చేశారు.
పేర్ని నాని ఏమన్నారంటే..
అయితే.. నటుడు సిద్ధార్థ, హీరో నాని చేసిన కామెంట్లపై మంత్రి పేర్ని నాని వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. ‘హీరో నాని గతంలో కిరాణా కొట్టు లెక్కలు చూశారేమో.. మాకు ఎలా తేలుస్తుంది?. అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమపై వ్యాఖ్యానించే వారు.. కొంత వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలన్నారు. ‘హీరో నాని గతంలో కిరాణా కొట్టు లెక్కలు చూశాడేమో.. మాకు ఎలా తేలుస్తుంది?. సిద్ధార్థ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఉండొచ్చు. అసలు సిద్ధార్థ ఇక్కడ(ఏపీ) ట్యాక్స్‌లు కట్టాడా..?. మేం ఎంత విలాసంగా ఉంటున్నామో సిద్ధార్థ చూశాడా..?. తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోడీ కోసమో ఆయన ఆ మాటలు అనుంటాడు’ అని మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మంత్రికి నెటిజన్ల కౌంటర్
ఇక, మంత్రి పేర్ని సిద్ధార్థ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. “సిద్ధార్థకు ఏపీతో ఏం పని.. ఆయన ఇక్కడ ఏమైనా పన్నులు కడుతున్నారా? అని ప్రశ్నించారు బాగానే ఉంది సర్. మరి.. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రుకు ఇక్కడ కోర్టులు, న్యాయస్థానాలతో ఏం పని?“ అని ప్రశ్నించారు.
ఆయన మీకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే.. చంకలు గుద్దుకున్నప్పుడు.. ఆయన మన రాష్ట్రం వ్యక్తి కాదు.. అని స్పృహ లేకుండా పోయింది. లేక.. పొగడ్తల, భజన మత్తు వదల్లేదా? మరి ఆయన విషయం.. “ఈయన మనవాడు కాదు.. మన న్యాయవ్యవస్థ గురించి.. కోర్టుల గురించి ఎందుకు మాట్లాడారు? అని అప్పట్లో ఎందుకు ప్రశ్నించలేదు“ అని నెటిజన్లు కౌంటర్లు విసురుతున్నారు.
అంటే.. సీఎంకు, వైసీపీకి అనుకూలంగా ప్రపంచంలో ఎవరైనా మాట్లాడొచ్చు. అది సాక్షి బ్యానర్ అవుతుందా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. తప్పులు ఎత్తిచూపితే మాత్రం నీకేం పనిరా ఇక్కడ? అని ప్రశ్నిస్తారా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు వైసీపీ సర్కారును మోసిన వారు కూడా ఇప్పుడు తిడుతున్నారు సార్. అని అంటున్నారు.
ప్రపంచం మొత్తం పొగడాలని.. పొగిడించుకోవాలని.. మీకు ఉన్నా.. మీరు అనుసరిస్తున్న వైఖరిని అందరూ గమనిస్తున్నారని చెబుతున్నారు. అందుకే.. సిద్ధార్థ వంటి యువ నటులు స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలోనూ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమైన విషయాన్ని గుర్తెరగాలని సూచిస్తున్నారు.